టర్కీలోని బొగ్గు గనుల్లో భారీ పేలుడు సంభవించింది. శుక్రవారం జరిగిన ఈ పేలుడులో 22మంది మరణించారు. గనుల్లో చాలా మంది చిక్కుకుపోయారు. ఎంతమంది ఉన్నారన్నది ఇంకా స్పష్టత రాలేదు. అధికారిక ప్రకటనల ప్రకారం…గనిలో సుమారు 110మంది పనిచేస్తున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన 17మందికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రి ఫహ్రెటిన్ కోకాస్ ట్వీట్ చేశారు. పేలుడు జరిగిన సమయంలో గనిలో దాదాపు 49 మంది పనిచేస్తున్నారని టర్కీ అంతర్గత వ్యవహారాల మంత్రి సులేమాన్ సోయ్లు అంతకుముందు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ గని 300 నుంచి 350 మీటర్ల లోతులో ఉందని, ప్రమాదకర ప్రాంతమని చెప్పారు.
Turkish mine blast's death toll rises to at least 22 https://t.co/1UckA6XwnU pic.twitter.com/GoeQVQpRuB
— Reuters (@Reuters) October 14, 2022
మీథేన్ వాయువు కారణంగా పేలుడు సంభవించిందని ఆ దేశ ఇంధన శాఖ మంత్రి ఫాతిహ్ డోన్మెజ్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం గనిలో మంటలు లేవని చెప్పారు. అలాగే లోపల వెంటిలేషన్ సిస్టమ్ కూడా సరిగ్గా పని చేస్తోందన్నారు. బార్టిన్ గవర్నర్ కార్యాలయం అందించిన సమాచారం ప్రకారం, గని గేట్ నుండి 300 మీటర్ల (985 అడుగులు) లోతులో 1515 GMT సమయంలో పేలుడు సంభవించింది. ఈ గని ప్రభుత్వ యాజమాన్యంలోని టర్కిష్ హార్డ్ కోల్ ఎంటర్‌ప్రైజెస్‌కు చెందినది.
కాగా ప్రమాదానికి సంబంధించిన ఫుటేజీని టర్కీ టెలివిజన్ నెట్‌వర్క్ విడుదల చేసింది. బొగ్గు గనుల్లో పనిచేస్తున్న వారి కుటుంబాలు ఆందోళనల చెందుతున్నాయి. పేలుడు ఘటనపై ఆ దేశ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.