ఇరాన్‌లో వివాదానికి అస‌లు కార‌ణం ఏంటో తెలుసా?

అమెరికాకు చెందిన హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్స్ న్యూస్ ఏజెన్సీ (HRANA) ప్రకారం.. నిరసనలు మొదలైనప్పటి నుండి సుమారు 3,000 మంది మరణించారు.

Published By: HashtagU Telugu Desk
Iran

Iran

Iran Violence: ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ పాలనకు వ్యతిరేకగా వారాల తరబడి జరిగిన నిరసనల తర్వాత ఇప్పుడు వీధుల్లో ప్రశాంతత నెలకొంది. అయితే స్థానిక నిరసనకారులలో బలప్రయోగం జరుగుతుందనే భయం ఇంకా కొనసాగుతోంది. వలసదారులు దేశాన్ని విడిచి వెళ్తున్నారు. ఈ తరుణంలో అల్ ముస్తఫా ఇంటర్నేషనల్ యూనివర్శిటీ ప్రొఫెసర్, పశ్చిమ ఆసియా నిపుణుడు జమీర్ అబ్బాస్ జాఫ్రీ మాట్లాడుతూ.. ఇక్కడి పరిస్థితుల గురించి ప్రపంచానికి చూపిస్తున్నది వాస్తవం కాదని తెలిపారు.

ఆయన వీధుల్లో సాధారణంగా తిరుగుతున్న వాహనాలను చూపిస్తూ.. ఇరాన్ లోపల నిరసనలు ముగిశాయని చెప్పారు. జనవరి 12న ఇక్కడి వ్యవస్థకు మద్దతుగా, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రదర్శన జరిగిన తర్వాత ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఆగిపోయాయి. ఇరాన్‌లో అసలు వివాదం ఏమిటో వివరిస్తాను అని ఆయన అన్నారు.

ఖమేనీ మద్దతుగా ర్యాలీ ఎందుకు?

ఇరాన్‌లోని కుమ్ నగరంలో నివసిస్తున్న భారతీయుడు జమీర్ అబ్బాస్ జాఫ్రీ మాట్లాడుతూ.. ఇరాన్ ప్రభుత్వానికి మద్దతుగా కోటి మందికి పైగా ప్రజలు రోడ్లపైకి వచ్చారని, కేవలం టెహ్రాన్ లోనే 30 లక్షల మందికి పైగా వచ్చారని తెలిపారు. దీనికి మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి. మొదటిది ఆర్థిక సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని కోరడం. రెండోది మేము ఉగ్రవాదానికి వ్యతిరేకం అని చాటడం. మూడోది అమెరికా- ఇజ్రాయెల్ మా శత్రువులని మాకు తెలుసు. వారి కుట్రల పట్ల మేము అప్రమత్తంగా ఉన్నామని చెప్పడం.

Also Read: న్యూజిలాండ్‌తో మూడో వ‌న్డే.. టీమిండియా ల‌క్ష్యం ఎంతంటే?!

ఆయన ఇంకా ఇలా అన్నారు. డిసెంబర్ చివరి వారంలో ఇరాన్‌లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు మొదలయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెన్యామిన్ నెతన్యాహు సమావేశమైన సమయంలోనే ఇరాన్ కరెన్సీ విలువను 30-40 శాతం పడిపోయేలా చేశారు. అమెరికా ఒత్తిడి వల్ల ఇరాన్‌లో ద్రవ్యోల్బణం 30-40 శాతం పెరిగి ఆర్థిక సమస్యలు తలెత్తాయి. ధరలు పెరగడంతో ప్రజల్లో ఆగ్రహం వచ్చింది, దీన్నే అదునుగా చూసుకుని ఇజ్రాయెల్ ఇరాన్ లోపలికి చొరబడాలని చూసింది అని ఆయ‌న అన్నారు.

ప్రభుత్వ వ్యతిరేక నిరసనలకు ప్రజలు ఎందుకు దూరమయ్యారు?

ఇరాన్ పక్షాన మాట్లాడుతున్న జమీర్ అబ్బాస్ జాఫ్రీ ఇలా అన్నారు. న్యాయమైన నిరసనలు జరుగుతున్నప్పుడు, అందులోకి ముసుగులు ధరించిన వ్యక్తులు ప్రవేశించి హింసను ప్రేరేపిస్తారు. దీనివల్ల ఇరాన్ ప్రజలు నెమ్మదిగా ఆ హింసకు దూరమయ్యారు. జనవరి మొదటి వారంలో నిరసనలు తగ్గడం మొదలయ్యాయి. కానీ ఇరాన్ దివంగత షా కుమారుడు రజా పహ్లావి (ప్రస్తుతం ఇరాన్‌తో సంబంధం లేని వ్యక్తి) ప్రజలను వీధుల్లోకి రావాలని కోరారు. మరోవైపు ఇజ్రాయెల్ జనవరి 8న దాడి చేస్తామని ప్రకటించింది, అప్పుడు ఇరాన్‌లో ఉగ్రవాద దాడులు జరిగాయి అని వివ‌రించారు.

గత నిరసనల జ్ఞాపకాలు

గత నిరసనలను గుర్తు చేసుకుంటూ ఆయన ఇలా అన్నారు. గత జనవరిలో యుద్ధం గురించి చర్చ జరిగినప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్‌కు గట్టి సమాధానం ఇచ్చింది. అప్పుడు ఇజ్రాయెల్ స్వయంగా కాల్పుల విరమణ చేయించుకుంది. అమెరికన్ ఎయిర్ బేస్‌పై ఇరాన్ దాడి చేసినప్పుడు కూడా అమెరికా, ఇజ్రాయెల్ వెనక్కి తగ్గాయి. ఇప్పుడు వారు అలాంటి నష్టాన్ని భరించలేరు. అందుకే ఇరాన్ ప్రజలను నిరసనల పేరుతో వీధుల్లోకి తెచ్చి హింస సృష్టించి, ఆపై దాడి చేయాలని ప్లాన్ చేశారు. కానీ ప్రజలు ప్రభుత్వానికి మద్దతుగా రావడంతో వారి ప్లాన్ ఫలించలేదు. ఇరాన్‌పై దాడి జరిగితే అది అమెరికా, ఇజ్రాయెల్‌లకు చాలా ప్రమాదకరమ‌ని సూచించారు.

అమెరికాకు చెందిన హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్స్ న్యూస్ ఏజెన్సీ (HRANA) ప్రకారం.. నిరసనలు మొదలైనప్పటి నుండి సుమారు 3,000 మంది మరణించారు. ఇరాన్ ప్రభుత్వం నిరసనకారులపై హింసకు పాల్పడితే దాడులు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదేపదే హెచ్చరించారు. అయితే ఖతార్, ఒమన్, సౌదీ అరేబియా, ఈజిప్ట్ దేశాలు అమెరికాను శాంతింపజేశాయని, దాడి చేయడం వల్ల ఆర్థిక- భద్రతాపరమైన ముప్పులు పొంచి ఉన్నాయని హెచ్చరించాయని భావిస్తున్నారు. దౌత్యపరమైన చర్యల తర్వాత ప్రస్తుతం ఇరాన్‌లో ప్రశాంతత నెలకొంది.

  Last Updated: 18 Jan 2026, 06:37 PM IST