India- EU Free Trade Deal: యూరోపియన్ యూనియన్ (EU)తో దాదాపు 18 ఏళ్ల పాటు సాగిన సుదీర్ఘ చర్చల తర్వాత జనవరి 27న భారత్-ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం పై సంతకాలు జరగడం ఒక చారిత్రాత్మక అడుగుగా పరిగణించబడుతోంది. ఈ ఒప్పందం తర్వాత ఐరోపాకు ఎగుమతి అయ్యే దాదాపు 97 శాతం భారతీయ ఉత్పత్తులపై టారిఫ్‌లు (పన్నులు) తొలగిపోతాయి. దీనివల్ల భారతదేశానికి ఏటా సుమారు 75 బిలియన్ డాలర్ల మేర కస్టమ్స్ సుంకం ఆదా అవుతుందని అంచనా. అదే సమయంలో భారత మార్కెట్లో యూరోపియన్ ఉత్పత్తుల ధరలు కూడా భారీగా తగ్గనున్నాయి.
చౌకగా దొరకనున్న బీర్, మద్యం
నివేదికల ప్రకారం.. బీర్ ధరలు దాదాపు 50 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది. అలాగే వైన్ ధరలు 20 నుండి 30 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది. అయితే అన్నింటికంటే పెద్ద మార్పు ఆటోమొబైల్ రంగంలో కనిపిస్తుంది. ప్రస్తుతం కార్లపై ఉన్న 110 శాతం టారిఫ్, ఈ ఒప్పందం వల్ల 10 శాతానికి పడిపోయే అవకాశం ఉంది. దీనితో పాటు పాస్తా, చాక్లెట్ వంటి యూరోపియన్ ఆహార ఉత్పత్తులపై ప్రస్తుతం ఉన్న 50 శాతం దిగుమతి సుంకం పూర్తిగా రద్దవుతుంది. దీనివల్ల ఈ ఉత్పత్తులు భారతీయ వినియోగదారులకు మరింత అందుబాటు ధరలోకి వస్తాయి.
Also Read: మాట తప్పడం టీడీపీ రక్తంలోనే లేదు – నారా లోకేష్
అమెరికా హై టారిఫ్ నేపథ్యంలో కొత్త ప్రత్యామ్నాయం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న భారీ టారిఫ్‌ల వల్ల ప్రపంచ వాణిజ్యంలో అనిశ్చితి నెలకొన్న సమయంలో భారత్ ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అమెరికా భారత్‌పై దాదాపు 50 శాతం వరకు పన్నులు విధించడం వల్ల భారత ఎగుమతులకు గట్టి దెబ్బ తగిలింది. ఈ నేపథ్యంలో భారత్-ఈయూ ఎఫ్‌టీఏ ప్రకటన రెండు దేశాల ఉన్నత స్థాయి ప్రతినిధుల మధ్య జరిగిన చర్చల అనంతరం వెలువడింది.
ఈ నెల ప్రారంభంలో యూరోపియన్ యూనియన్ లాటిన్ అమెరికన్ దేశాలతో కూడా ఒప్పందం చేసుకుంది. సాంప్రదాయ భాగస్వాములతో పాటు కొత్త వాణిజ్య భాగస్వాముల కోసం చూస్తున్నామని ఈయూ సంకేతాలిచ్చింది. మారుతున్న ప్రపంచ వాణిజ్య పరిస్థితుల్లో భారత్, ఐరోపా దేశాలకు ఈ ఒప్పందం వ్యూహాత్మకంగా చాలా కీలకం. ఈ ఎఫ్‌టీఏ తర్వాత 2032 నాటికి 96 శాతం వస్తువులపై టారిఫ్‌లను పూర్తిగా తొలగించాలని యూరోపియన్ యూనియన్ లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల ఏటా దాదాపు 4 బిలియన్ డాలర్ల ఆదా జరుగుతుందని అంచనా వేస్తున్నారు.
