Site icon HashtagU Telugu

Elon Musk Package : షాకింగ్.. రూ.4.7 లక్షల కోట్ల శాలరీ ప్యాకేజీకి మస్క్‌ అనర్హుడు.. కోర్టు తీర్పు

Elon Musk pay package for Tesla

Elon Musk Package : అపర కుబేరుడు,  ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ ‘టెస్లా’ అధిపతి  ఎలాన్‌ మస్క్‌కు మరోసారి భంగపాటు ఎదురైంది. టెస్లా కంపెనీ సీఈవో హోదాలో ఆయనకు  రూ.4.7 లక్షల కోట్ల వార్షిక వేతన ప్యాకేజీని అందించడానికి డెలావర్‌లోని కోర్టు మరోసారి  నో చెప్పింది. మస్క్ శాలరీ ప్యాకేజీని తిరస్కరిస్తూ గతంలో ఇచ్చిన తీర్పును న్యాయస్థానం సమర్ధించుకుంది. కంపెనీలోని వాటాదారుల ఓటింగ్  ప్రక్రియ ద్వారా ఈ శాలరీ ప్యాకేజీని ఓకే చేయించుకోవాలని ఎలాన్ మస్క్(Elon Musk Package) చేసిన ప్రయత్నాన్ని కోర్టు తప్పుపట్టింది. ఒకవేళ ఎలాన్ మస్క్‌కు అంత  భారీ శాలరీ ప్యాకేజీని ఇస్తే టెస్లా కంపెనీ వాటాదారులకు అన్యాయం జరుగుతుందని కోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది.

Also Read :Akal Takht : మాజీ డిప్యూటీ సీఎంకు ‘అకల్ తఖ్త్’ సంచలన శిక్ష.. ఏమిటో తెలుసా ?

వాస్తవానికి ఎలాన్ మస్క్‌  చివరిసారిగా 2018 సంవత్సరంలో టెస్లా కంపెనీ నుంచి దాదాపు రూ.4.7 లక్షల కోట్ల శాలరీ ప్యాకేజీని తీసుకున్నారు. ప్రపంచ కార్పొరేట్‌ వ్యాపార చరిత్రలో అత్యధికంగా తీసుకున్న పారితోషికం అదే. ఆ ప్యాకేజీని తీసుకోవడంలో మస్క్ ప్రపంచ కుబేరుడిగా మారిపోయాడు.  అయితే ఆ ఏడాది మస్క్‌కు అంత భారీ శాలరీ ఇవ్వడంపై అభ్యంతరం తెలుపుతూ టెస్లా కంపెనీ వాటాదారుడు రిచర్డ్ టోర్నెట్టా డెలావర్ కోర్టులో పిటిషన్ వేశారు. కార్పొరేట్‌ ఆస్తులను వృథా చేసేలా మస్క్ శాలరీ తీసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. టెస్లా కంపెనీ డైరెక్టర్లపై మస్క్ నియంతృత్వ ధోరణిలో వ్యవహరిస్తూ.. నచ్చినంత శాలరీ ప్యాకేజీకి ఆమోదించాలని ఆదేశాలు ఇస్తున్నారని పిటిషనర్ ఆరోపించారు.  అందువల్లే టెస్లా కంపెనీ డైరెక్టర్లు స్వతంత్రంగా పని చేయలేకపోతున్నారని రిచర్డ్ టోర్నెట్టా  చెప్పారు.

Also Read :Nitish Reddy : ఆస్ట్రేలియా గడ్డపై సత్తా చాటుతున్న తెలుగు తేజం నితీశ్‌ రెడ్డి

దీనిపై గతంలో విచారణ జరిపినప్పుడు కూడా డెలావర్ కోర్టు.. ఎలాన్ మస్క్ తీరును తప్పుపట్టింది. అంత ప్యాకేజీకి ఆయన అనర్హుడని పేర్కొంటూ ఈ ఏడాది జనవరిలో తీర్పును వెలువరించింది. డెలావర్ కోర్టు తీర్పునకు వ్యతిరేకంగా ఈ ఏడాది జూన్‌లో టెస్లా వార్షిక సమావేశంలో తన శాలరీ  ప్యాకేజీపై ఎలాన్ మస్క్ నిర్ణయం తీసుకున్నారు. వాటాదారులతో ఓటింగ్‌ చేయించుకొని తనకు రూ.4.7 లక్షల కోట్ల వార్షిక శాలరీ ప్యాకేజీని ఓకే చేయించుకున్నారు. వాటాదారుల ఓటింగ్ తీర్మానంతో ఎలాన్ మస్క్ మళ్లీ డెలావర్ కోర్టును ఆశ్రయించాడు. అయితే మరోసారి న్యాయస్థానం మస్క్ అభ్యర్థనను తోసిపుచ్చింది. ఈ పిటిషన్ వేసినందుకు రూ.2,900  కోట్లను ప్రభుత్వ న్యాయవాదుల ఫీజుగా చెల్లించాలని  మస్క్‌‌ను న్యాయస్థానం ఆదేశించింది. ఇక ఈ తీర్పుపై పైకోర్టులో అప్పీల్ చేస్తానని మస్క్ ప్రకటించారు. కంపెనీ ఓట్లపై నియంత్రణ అనేది షేర్ హోల్డర్లకే ఉండాలని, జడ్జీలకు ఉండకూడదన్నారు.