పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని రైల్వే ట్రాక్ సమీపంలో శుక్రవారం పేలుడు (Explosion) సంభవించింది. ఈ పేలుడులో దాదాపు ఎనిమిది మంది గాయపడినట్లు సమాచారం. బలూచిస్థాన్‌లోని పాకిస్తాన్ రైల్వే ప్రతినిధి తెలిపిన వివరాల ప్రకారం.. పెషావర్‌కు వెళ్లే జాఫర్ ఎక్స్‌ప్రెస్ పనీర్ ప్రాంతం గుండా వెళుతుండగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో గాయపడిన ఎనిమిది మందిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మరోవైపు జిల్లాలోని అన్ని ఆస్పత్రుల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఈ ఘటనను ధృవీకరిస్తూ డిప్యూటీ కమిషనర్ కచ్ అఘా సమీవుల్లా మాట్లాడుతూ.. రైలులోని పలు బోగీలు పట్టాలు తప్పిన రిమోట్ కంట్రోల్ పేలుడు ఇది అని తెలిపారు. గత నెలలో కూడా బలూచిస్తాన్‌లో తీవ్రవాద కార్యకలాపాలు జరిగాయి. ఇందులో కెప్టెన్‌తో సహా ఆరుగురు భద్రతా సిబ్బంది మరణించగా, 17 మంది గాయపడ్డారు.
Also Read: Powerful Earthquake: అర్జెంటీనాలో భారీ భూకంపం.. ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనం
ఇస్లామాబాద్‌కు చెందిన థింక్-ట్యాంక్ పాక్ ఇన్స్టిట్యూట్ ఫర్ పీస్ స్టడీస్ (PIPS) ప్రకారం.. 2022లో 262 ఉగ్రవాద దాడుల్లో మొత్తం 419 మంది మరణించారు. వివిధ జాతీయవాద తిరుగుబాటుదారులు, మతపరమైన ప్రేరేపిత తీవ్రవాదులు, హింసాత్మక సెక్టారియన్ గ్రూపులు పాకిస్తాన్‌లో మొత్తం 262 తీవ్రవాద దాడులను నిర్వహించాయి. ఇందులో 14 ఆత్మాహుతి బాంబు దాడులు ఉన్నాయి. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 27 శాతం ఎక్కువ అని PIPS తన వార్షిక నివేదికలో పేర్కొంది.
అలాగే.. ఈ ఉగ్రవాద దాడుల్లో మొత్తం 419 మంది మరణించారు. ఇది 2021లో జరిగిన మరణాల కంటే 25 శాతం ఎక్కువ అని నివేదిక పేర్కొంది. ఇది కాకుండా ఇందులో సుమారు 734 మంది గాయపడినట్లు కూడా నివేదికలో పేర్కొన్నారు. 2022లో పాకిస్థాన్‌లో జరిగిన ఉగ్రవాద దాడుల కారణంగా మరణించిన వారిలో దాదాపు సగం మంది భద్రతా బలగాలు, చట్ట అమలు సంస్థల సిబ్బంది ఉన్నారు.