Gunmen – Live : టీవీ స్టూడియోలో లైవ్.. తుపాకులతో దుండగుల ఎంట్రీ.. ఏమైందంటే ?

Gunmen - Live : టెలివిజన్ స్టూడియోలో లైవ్ నడుస్తుండగా ముసుగు ధరించిన ముష్కరులు తుపాకులు చేతపట్టి చొరబడ్డారు. 

  • Written By:
  • Updated On - January 10, 2024 / 07:55 AM IST

Gunmen – Live : టెలివిజన్ స్టూడియోలో లైవ్ నడుస్తుండగా ముసుగు ధరించిన ముష్కరులు తుపాకులు చేతపట్టి చొరబడ్డారు.  లైవ్ షోలో పాల్గొంటున్న వారిని బెదిరించి భయభ్రాంతులకు గురి చేశారు. లైవ్ ఫీడ్ నడుస్తుండగానే.. నేలపై బోర్లా పడుకోవాలని అక్కడున్న వారందరికీ వార్నింగ్ ఇచ్చారు. అనంతరం సాయుధ దుండగులు కొంతమందిని కిడ్నాప్ చేసి అక్కడి నుంచి తీసుకెళ్లారు. గ్వాయాక్విల్ నగరంలో ఉన్న పబ్లిక్ టెలివిజన్ ఛానెల్ TCకి చెందిన స్టూడియోలో ఈ ఘటన చోటుచేసుకుంది.  ఆ వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. దుండగులను అరెస్టు చేయడంతో కథ సుఖాంతమైంది. దుండగులను అదుపులోకి తీసుకొని.. బోర్లా పడుకోబెట్టి.. చేతులను వెనక్కి మలిచి కట్టేసిన ఫొటోలను ఈక్వెడార్ భద్రతా బలగాలు విడుదల చేశాయి.

We’re now on WhatsApp. Click to Join.

రెండు నెలల క్రితం ఈక్వెడార్‌లోని ఒక జైైలు నుంచి కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ ఒకరు తప్పించుకున్నాడు. అతడి పేరు అడాల్ఫో మాకియాస్ విల్లామార్ అలియాస్ ఫిటో.  ఇప్పుడు చోటుచేసుకున్న ఘటన వెనుక అతడి హస్తమే ఉందేమోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంగళవారం TC టీవీ స్టేషన్‌లో జరిగిన దాడిలో.. ఒక ముష్కరుడు పంప్ యాక్షన్ షాట్‌గన్‌ని బందీలలో ఒకరి తలపై గురిపెట్టాడు. అక్కడున్న వాళ్లందరికీ కదిలితే కాల్చేస్తామనే వార్నింగ్ ఇచ్చాడు. ఈక్రమంలో దయచేసి షూట్ చేయొద్దు అని ఒక మహిళ వేడుకుంది. మరోవైపు ఒక వ్యక్తిపై దుండగులు దాడి చేయగా.. అతడు నొప్పితో అరుస్తున్నట్లుగా లైవ్ కెమెరాలో రికార్డు(Gunmen – Live) అయింది.

Also Read: Maldives -China : చైనాకు మాల్దీవుల అధ్యక్షుడి బిగ్ రిక్వెస్ట్.. ఏమిటో తెలుసా ?

జైలు నుంచి గ్యాంగ్‌స్టర్ ఫిటో తప్పించుకున్న తర్వాత ఈక్వెడార్ దేశంలోని పలు ప్రాంతాల్లో శాంతిభద్రతలు అదుపు తప్పాయి. సోమవారం ఉదయం పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి. దీంతో హింసను అరికట్టడానికి సోమవారం రాత్రిపూట కర్ఫ్యూ విధించారు. ఈనేపథ్యంలో మంగళవారం తెల్లవారుజామున రియోబాంబా నగరంలోని జైలు నుంచి మరో డ్రగ్ ముఠా నాయకుడు సహా దాదాపు 40 మంది ఖైదీలు పారిపోయారు. ఈ ఖైదీలు దాదాపు  ఏడుగురు పోలీసు అధికారులను కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లారు. ఇక గుయాక్విల్‌ నగరంలోని టీవీ స్టేషన్‌లో చోటుచేసుకున్న ఘటన స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది. ఇటీవలి కాలంలో ఈక్వెడార్‌లోని జైళ్లు ప్రత్యర్థి ముఠాల మధ్య గొడవలతో అట్టుడికాయి. ఎంతోమంది  హత్యకు గురయ్యారు. మరెంతో మంది జైళ్ల నుంచి పారిపోయారు. ఇక ఫిటో జైలు నుంచి పారిపోవడానికి సాయం చేశారనే అనుమానంతో ఇద్దరు జైలు గార్డులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రపంచంలోని అరటి ఎగుమతిదారులలో ఈక్వెడార్ నంబర్ 1. చమురు, కాఫీ, కోకో, రొయ్యలు, చేప ఉత్పత్తులను కూడా ఈ దేశం పెద్దఎత్తున ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తుంది.