Earthquakes : గత రెండేళ్లలో ప్రపంచవ్యాప్తంగా భూకంపాలు పెరిగిపోయాయి. తాజాగా ఇవాళ (బుధవారం) తెల్లవారు జామున 1:51 గంటలకు గ్రీస్‌లో భూకంపం వచ్చింది. అత్యధికంగా 6.3 తీవ్రతతో అక్కడ భూమి కంపించింది. దీంతో భవనాలు, ఇళ్లు కంపించాయి. ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూమికి 78 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని గుర్తించారు. గ్రీస్‌లో భూకంపం ప్రభావం ప్రధానంగా క్రెట్ ఐలాండ్‌పై పడిందని సమాచారం. ఇక ఇదే సమయంలో ఈజిప్టులోని కైరో నగరంలో, ఇజ్రాయెల్, లెబనాన్, తుర్కియే, జోర్డాన్‌లలోని వివిధ నగరాల్లో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఇజ్రాయెల్‌లోని టెల్ అవివ్, జెరూసలెం సహా వివిధ ప్రాంతాల్లో 2.3 తీవ్రతతో భూకంపం వచ్చింది. మెక్సికో దేశంలోని జాలిస్కో తీరంలోనూ 5.9 తీవ్రతతో భూకంపం వచ్చింది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చిందని గుర్తించారు.
సునామీ ముప్పు ఉంది ?
ఈ భూకంపాల్లో ఎంత ప్రాణ నష్టం జరిగింది ? ఎంత ఆస్తినష్టం జరిగింది ? అనే వివరాలు తెలియరాలేదు. గ్రీస్, ఈజిప్టు, టర్కీ, ఇజ్రాయెల్, లెబనాన్, టర్కీ, జోర్డాన్ దేశాలు మధ్యధరా సముద్రం చుట్టూ ఉన్న దేశాలేే. తాజా భూకంపంతో(Earthquakes) మధ్యధరా సముద్రంలో సునామీ వచ్చే ముప్పు ఉందా అనే కోణంలోనూ ఆయా దేశాల మీడియాలో చర్చ జరిగింది. అయితే ప్రస్తుతానికి అలాంటి భయమేదీ అక్కర్లేదని నిపుణులు స్పష్టం చేశారు.
సైక్లేడ్స్ దీవుల్లో 18,400కుపైగా భూకంపాలు
భూమిలోపల టెక్టానిక్ ప్లేట్లు ఉంటాయి. వాటి కదలికల్లో చోటుచేసుకునే హెచ్చుతగ్గుల వల్లే భూకంపాలు వస్తుంటాయి. గ్రీస్ దేశం విషయానికొస్తే.. ఇది క్రియాశీల టెక్టానిక్ ప్లేట్ల ఫాల్ట్ లైన్లపై ఉంది. అందుకే గ్రీస్‌కు భూకంపాల ముప్పు ఎక్కువ. ఈ ఏడాది జనవరి 26 నుంచి ఫిబ్రవరి 13 మధ్యకాలంలో గ్రీస్ పరిధిలోని సైక్లేడ్స్ ద్వీపసమూహ దీవుల్లో తక్కువ తీవ్రత కలిగిన 18,400కుపైగా భూకంపాలు సంభవించాయి.