Earthquake: తైవాన్‌ను వణికించిన భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!

  • Written By:
  • Publish Date - September 18, 2022 / 06:40 PM IST

తైవాన్‌ను భారీ భూకంపం వణించింది. రిక్టర్‌ స్కేల్‌పై 6.9 తీవ్రతతో ఆదివారం ప్రకంపనలు వచ్చాయని యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే తెలిపింది. ఆగ్నేయ తైవాన్‌లోని చిషాంగ్ టౌన్‌షిప్‌లో 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రం గుర్తించినట్లు పేర్కొంది. భారీగా ప్రకంపనల కారణంగా రెండంతస్తుల భవనం కూలిపోగా.. ఓ రైలుపట్టాలు తప్పింది. ఇప్పటివరకు ఉన్న సమాచారం మేరకు.. ప్రకంపనలు నగరానికి ఉత్తరాన 50 కిలోమీటర్ల దూరంలో మధ్యాహ్నం 2:44 సమయంలో వచ్చాయని యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే పేర్కొంది.

అయితే, భారీ ప్రకంపనలకు రెండస్తుల బిల్డింగ్‌ కూలిపోగా.. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఒక్కసారిగా భూమి కంపించడంతో జనం ప్రాణాలను అరచేతుల్లో పట్టుకొని భవనాల్లో నుంచి పరుగులు పెట్టారు. రైలు పట్టాలు తప్పిన ఘటనలో దాదాపు 20 మంది ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీశారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తైవాన్ రైల్వే అడ్మినిస్ట్రేషన్ తెలిపింది.

భారీ భూకంపం నేపథ్యంలో జపాన్‌ వాతావరణ శాఖ సునామీ హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణ ద్వీపం క్యుషును ఖాళీ చేయాలని అధికారులు ప్రజలను కోరారు. తైవాన్‌తో అనుబంధంగా ఉన్న ద్వీపంలో సునామీ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. భూకంపం ప్రభావంతో 300 కిలోమీటర్ల పరిధిలో సునామీ వచ్చే అవకాశం ఉందని, అలలు ఎగిసిపడే అవకాశం ఉందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) పేర్కొంది. భూకంపం నేపథ్యంలో సహాయం అందించేందుకు సైనికులను మోహరించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి సన్‌ లీ ఫాంగ్‌ తెలిపారు.