Flights: మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల ప్రభావం ఇప్పుడు ఆకాశంలో కూడా కనిపిస్తోంది. అక్కడ విమాన ప్రయాణ ధరలు రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాయి. అవును మిడిల్ ఈస్ట్‌లో పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రయాణికులలో ఆందోళనను పెంచాయి. గత వారంలో వెలుగుచూసిన గణాంకాలు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి. దుబాయ్ వెళ్లే విమాన టికెట్ల ధరలు 60% నుండి 80% వరకు పెరగగా, జర్మనీ, పోర్చుగల్ వంటి యూరప్ దేశాలకు వెళ్లే టికెట్లు 40%పైగా ప్రియమయ్యాయి.
ఇదంతా ఎందుకు జరుగుతోంది?
ఇది కేవలం డిమాండ్, సప్లైకి సంబంధించిన విషయం మాత్రమే కాదు. దీని వెనుక అసలు కారణాలు చాలా తీవ్రమైనవి. యుద్ధ పరిస్థితుల దృష్ట్యా భద్రతాపరమైన ముప్పు కారణంగా అనేక దేశాలు తమ గగనతలాన్ని మూసివేశాయి. దీనివల్ల విమానయాన సంస్థలు సుదీర్ఘమైన, ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాల్సి వస్తోంది. ఫలితంగా ఇంధన వినియోగం పెరిగింది. మరోవైపు అశాంతి నెలకొన్న ప్రాంతాల మీదుగా వెళ్లే విమానాలకు రిస్క్ కవర్ అంటే ఇన్సూరెన్స్ ప్రీమియంలు భారీగా పెరిగాయి.
Also Read: ఐపీఎల్ 2026 కోసం రెడీ అవుతున్న రోహిత్ శర్మ.. నెట్ ప్రాక్టీస్ వీడియో వైరల్!
ఫ్లైట్స్ రద్దు కావడం
యుద్ధ పరిస్థితుల వల్ల రద్దవుతున్న మొత్తం విమానాల్లో 50% నుండి 65% వరకు కేవలం దుబాయ్ రూట్‌కు చెందినవే ఉన్నాయి. ఢిల్లీ-ఫ్రాంక్‌ఫర్ట్ వంటి బిజీ రూట్‌లలో ఎకానమీ క్లాస్ టికెట్ ధర ఏకంగా 1.5 లక్షల రూపాయలు దాటిపోయింది. కొన్ని చోట్ల సీట్లు కూడా అందుబాటులో లేవు.
ట్రావెల్ కంపెనీల రీ-రూటింగ్ సహాయం
ఈ గందరగోళ పరిస్థితుల మధ్య ట్రావెల్ కంపెనీలు ఇప్పుడు రీ-రూటింగ్ సేవలపై ఆధారపడుతున్నాయి. Pickyourtrail వంటి కంపెనీలు ప్రయాణికులకు 2-4 గంటల వ్యవధిలోనే కొత్త రూట్ ప్లాన్ చేయడంలో సహాయపడుతున్నాయి. వీటితో పాటు రీఫండబుల్ హోటళ్లు, అదనపు ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను కూడా అందిస్తున్నాయి.
ప్రయాణికులకు ముఖ్య గమనిక
ప్రయాణ ఖర్చులను తగ్గించుకోవాలనుకుంటే ఒకవేళ డైరెక్ట్ ఫ్లైట్ చాలా ఖరీదుగా ఉంటే కనెక్టింగ్ ఫ్లైట్స్ లేదా ప్రత్యామ్నాయ నగరాల రూట్‌లను పరిశీలించండి. అత్యవసర బుకింగ్‌లను వీలైనంత వరకు నివారించండి. సాధ్యమైతే మీ ప్రయాణాన్ని మరో 15 రోజులు వాయిదా వేసుకోండి. ఎందుకంటే ప్రస్తుత బుకింగ్‌లు ప్రీమియం ధరలకు లభిస్తున్నాయి. ఈ సమయంలో యుద్ధం లేదా అశాంతిని కవర్ చేసే ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా ముఖ్యం. దీనివల్ల విమానం రద్దయినా మీ డబ్బు వృథా కాదు.
