Site icon HashtagU Telugu

Drone Attack : ప్రధాని నివాసంపై డ్రోన్ ఎటాక్.. ఏం జరిగిందంటే.. ?

Drone Attack On Benjamin Netanyahus Residence

Drone Attack : ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ ఇంటిపై మరోసారి డ్రోన్‌తో దాడి జరిగింది. సిజేరియా ప్రాంతంలోని ఆయన నివాసం పరిసరాల్లో ఒక డ్రోన్ పడింది. అయితేే ఈ దాడిలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఇజ్రాయెలీ మీడియాలో కథనాలు వచ్చాయి. దీనిపై ఇజ్రాయెలీ ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.  ప్రధాని నివాసంపై డ్రోన్ దాడి జరిగిన విషయం నిజమేనని ధ్రువీకరించింది. ఆ టైంలో నివాసంలో నెతన్యాహూ లేరని స్పష్టం చేసింది. డ్రోన్ దాడి వల్ల ప్రాణ నష్టం సంభవించలేదని వెల్లడించింది. లెబనాన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే హిజ్బుల్లా మిలిటెంట్ సంస్థ ఈ డ్రోన్‌ను(Drone Attack) ప్రయోగించి ఉండొచ్చని గుర్తించారు.

Also Read :IQ Vs Embryos : సూపర్ హ్యూమన్స్ రెడీ.. మానవ పిండాలకు ఐక్యూ టెస్ట్

ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్‌లోని సిజేరియా ప్రాంతంలో ఉన్న నెతన్యాహూ నివాసం వైపుగా మూడు డ్రోన్లు వెళ్తుండగా.. రెండింటిని మార్గం మధ్యలోనే ఇజ్రాయెలీ ఆర్మీ కూల్చేసింది. అయితే ఒకటి మాత్రం విజయవంతంగా ప్రధాని నివాసాన్ని తాకగలిగింది. ఆ డ్రోన్లు ప్రయాణించిన మార్గంలోని ఇజ్రాయెలీ పట్టణాలు, నగరాల్లో సైరన్ల మోత మోగింది. దీంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఎందుకంటే ఇటీవలే హిజ్బుల్లా డ్రోన్ దాడిలో దాదాపు 60 మందికిపైగా ఇజ్రాయెలీ సైనికులు తీవ్ర గాయాలపాలవగా..  నలుగురు చనిపోయారు. లెబనాన్‌ భూభాగంలోకి ఇజ్రాయెలీ  ఆర్మీ చొరబడినందున.. అక్కడి మిలిటెంట్ సంస్థ హిజ్బుల్లా డ్రోన్లతో దాడులను తీవ్రతరం చేసింది. పెద్దసంఖ్యలో డ్రోన్లు, మిస్సైళ్లతో ఇజ్రాయెలీ పట్టణాలపై భీకరదాడులు చేస్తోంది. ఈ దాడుల్లో జరుగుతున్న నష్టాన్ని చూపించకుండా ఇజ్రాయెలీ మీడియాపై ప్రధానమంత్రి నెతన్యాహూ సెన్సార్ షిప్ చేస్తున్నారు. ఫలితంగా అక్కడి వాస్తవ స్థితిగతులు, మరణాల వివరాలు ఎప్పటికప్పుడు వెలుగులోకి రావడం లేదు. పాలస్తీనాలోని రఫా ప్రాంతంలో ఇజ్రాయెలీ దళాల దాడిలో హమాస్ మిలిటెంట్ సంస్థ అగ్రనేత యహ్యా సిన్వార్  చనిపోయాడు. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై దాడులను హిజ్బుల్లా తీవ్రతరం చేసింది.