Trump Win : రిపబ్లికన్ పార్టీ తరఫున మరోసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న డొనాల్డ్ ట్రంప్ ఆ దిశగా కీలక పురోగతి సాధించారు. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిని ఎంపిక చేయడంపై అమెరికాలోని అయోవా స్టేట్‌లో నిర్వహించిన ప్రైమరీ ఎలక్టోరల్ ఎలక్షన్‌లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. ఆయనకు అత్యధికంగా 52.8 శాతం మేర ఓట్లు వచ్చాయి. అందరినీ ఆశ్చర్యపరుస్తూ రెండోస్థానంలో రాన్ డీశాంటీస్ నిలిచారు. ఈయనకు 21.4 శాతం ఓట్లు వచ్చాయి. దీన్నిబట్టి అమెరికా ప్రజలు పాలనా వ్యవహారాల్లో శ్వేత జాతీయులకే ప్రాధాన్యం ఇస్తున్నారని స్పష్టమైంది. భారత సంతతికి చెందిన నిక్కీ హేలీకి 17.7 శాతం ఓట్లు, వివేక్ రామస్వామికి 7.2 శాతం ఓట్లు మాత్రమే(Trump Win) పడ్డాయి.
We’re now on WhatsApp. Click to Join.
అయోవా స్టేట్‌లో రిపబ్లికన పార్టీ అభ్యర్థిత్వం ఖరారు కావడానికి 1,215 ఓట్లు అవసరం. అయితే డొనాల్డ్ ట్రంప్‌కు మొదటి రౌండ్‌లోనే 2,035 ఓట్లు వచ్చాయి. రెండో స్థానంలో నిలిచిన రాన్ డీశాంటీస్‌కు 824 ఓట్లు వచ్చాయి. నిక్కీ హేలీకి 682 ఓట్లు, వివేక్ రామస్వామికి 278 ఓట్లు పడ్డాయి. దీంతో వరుసగా మూడోసారి డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి మార్గం సుగమం అవుతోందనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి. 2016 నాటి ఎన్నికల్లో ఆయన సారథ్యంలోనే అమెరికాలో ప్రభుత్వం ఏర్పాటైంది. ఆ తరువాతి ఎన్నికల్లో స్వల్ప తేడాతో ట్రంప్ ఓడిపోయారు. ఇక మూడోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఆయన రెడీ అవుతున్నారు. నాలుగేళ్లకోసారి జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్.. ఈ ఏడాది డిసెంబర్‌లో జరగనుంది. ప్రస్తుతం డెమొక్రటిక్ పార్టీ అక్కడ అధికారంలో ఉంది.
Also Read: CM Revanth – Davos : దావోస్‌లో పెట్టుబడుల వేట.. ప్రముఖులతో సీఎం రేవంత్ సమావేశాలు
రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న వివేక్ రామస్వామి.. ఉపాధ్యక్ష అభ్యర్థిత్వాన్ని స్వీకరించడానికి ఇటీవల సుముఖత వ్యక్తం చేశారు. ‘నాకు పదవి ముఖ్యం కాదు. ఇంత చిన్న వయసులో ఉపాధ్యక్ష పదవి కూడా మంచి పదవే. శ్వేతసౌధంలో ట్రంప్ నా మార్గదర్శకులుగా, సలహాదారుగా ఉంటే సంతోషిస్తా’ అని వివేక్ గతంలో అన్నారు. అప్పుడు దానిపై ట్రంప్ నుంచి కూడా సానుకూల స్పందనే వచ్చింది. మీరు ఆయన్ను ఉపాధ్యక్ష అభ్యర్థిగా పరిగణించారా? అని ప్రశ్నించగా..‘ఆయన చాలా తెలివైన వ్యక్తి. ఆయన తగిన వ్యక్తి అని భావిస్తున్నా’ అని బదులిచ్చారు. కానీ ఇప్పుడు ట్రంప్ వర్గం నుంచి మరో రకమైన రియాక్షన్ వచ్చింది. ‘ఓటర్లు వివేక్‌ను ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎన్నుకోకపోవచ్చు. ఆయన ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఉండరు’ అని తేల్చి చెప్పింది. ‘‘నా మద్దతుదారులు రామస్వామికి ఓటువేయొద్దు. ఆయనొక అవినీతి పరుడు. ఆర్థిక నేరగాడు’’ అని ఇటీవల ట్రంప్ ఆరోపించారు. మోసపూరిత ప్రచారాలతో తన అనుచరుల మద్దతు కూడగట్టేందుకు ప్రయ్నతిస్తున్నాడని విమర్శించారు.