Site icon HashtagU Telugu

Trump Vs Buffet: ట్రంప్ దెబ్బకు మార్కెట్లు డౌన్.. బఫెట్ సంపద అప్.. ఎలా ?

Donald Trump Vs Warren Buffet Elon Musk Jeff Bezos

Trump Vs Buffet: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ దూకుడుపై ఉన్నారు. ఆయన తనదైన స్టైల్‌లో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.  భారత్ సహా ఎన్నో దేశాలపై ప్రతీకార సుంకాలను ట్రంప్ విధించారు.  దీని ప్రతికూల ప్రభావం అమెరికాలోని కంపెనీలపైనా పడింది. ప్రధానంగా విదేశీ దిగుమతులపై ఆధారపడిన అమెరికన్ కంపెనీలు విలవిలలాడాయి. పర్యవసానంగా అమెరికా స్టాక్ మార్కెట్లు డౌన్ అయ్యాయి. డీలాపడ్డాయి. ఫలితంగా ప్రపంచంలోని టాప్ 500 కుబేరుల సంపద విలువ గురువారం ఒక్కరోజే దాదాపు రూ.17.73 లక్షల కోట్లు తగ్గింది. కరోనా కాలం తర్వాత కుబేరులు ఇంత భారీ రేంజులో సంపదను పోగొట్టుకోవడం మళ్లీ ఇదే తొలిసారి. ఈ అలజడిలోనూ వారెన్ బఫెట్ చెక్కుచెదరలేదు. ఆయన సంపద తగ్గకపోగా.. భారీగా పెరిగింది. 2025 సంవత్సరంలో ఇప్పటివరకు వారెన్‌ బఫెట్‌(Trump Vs Buffet) సంపద దాదాపు రూ.1.10 లక్షల కోట్లు పెరిగింది. దీంతో అంతటా ఆయన విజన్‌, ప్లానింగ్‌, పెట్టుబడి సూత్రాలపైనే చర్చ జరుగుతోంది.

Also Read :Anti Aging Treatments: యాంటీ ఏజింగ్ చికిత్సలు, ఖర్చులు.. లేటెస్ట్ ట్రెండ్‌పై ఓ లుక్

జపానే ఎందుకు ? 

ట్రంప్ అమెరికా అధ్యక్షుడు కాగానే వారెన్ బఫెట్ అలర్ట్ అయ్యారు. ఆయన కంపెనీ పేరు బెర్క్‌షైర్‌ హాత్‌వే. దీనికి అమెరికాలోని ఎన్నో ప్రముఖ కంపెనీల్లో వాటాలు ఉన్నాయి. ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత తీసుకునే నిర్ణయాలపై ముందే బఫెట్ ఒక అంచనాకు వచ్చారు. ఎన్నికల సమయంలో చేసిన ప్రకటనలు, ఇచ్చిన  హామీల ఆధారంగా ఈ అంచనాకు బఫెట్ రాగలిగారు. అందుకే ట్రంప్ ప్రెసిడెంట్ అయిన వెంటనే.. యాపిల్, బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికాల్లోని తన వాటాలను వారెన్ బఫెట్ తగ్గించుకున్నారు. వాటిని మంచి ధరకు అమ్మేశారు. అలా సమకూరిన డబ్బులను జపాన్‌ కంపెనీలు మిత్సుయ్, మిత్సుబిషి, సుమిటోమో, ఇటోచు, మారుబెనిల్లో పెట్టుబడి పెట్టారు. ఎందుకంటే అమెరికాలో చోటుచేసుకునే పరిణామాల వల్ల, ట్రంప్ తీసుకునే నిర్ణయాల వల్ల పెద్దగా ప్రభావితం కాని దేశం జపాన్. అందుకే బఫెట్ చూపు జపాన్‌పై పడింది. ప్రస్తుతం జపాన్ కంపెనీలు మిత్సుయ్‌లో  9.82 శాతం వాటా, మిత్సుబిషిలో 9.67 శాతం వాటా, సుమిటోమోలో 9.29 శాతం వాటా, ఇటోచులో 8.53 శాతం వాటా, మారుబెనీలో  9.30 శాతం వాటా వారెన్ బఫెట్‌కు ఉంది. ప్రస్తుతం ఈ జపాన్ కంపెనీలన్నీ లాభాల్లో ఉన్నాయి. ఫలితంగా బఫెట్‌కు చెందిన బెర్క్‌షైర్‌ హాత్‌వే కంపెనీ మార్కెట్‌ విలువ 1.14 ట్రిలియన్ డాలర్లకు చేరింది.

Also Read :Anant Ambani : అనంత్ అంబానీకి కుషింగ్ సిండ్రోమ్.. ఏమిటిది ?

మస్క్, జుకర్‌బర్గ్, బెజోస్, గేట్స్ చతికిల.. 

2025 సంవత్సరంలో ఇప్పటివరకు ఎక్స్, టెస్లా, స్పేస్ ఎక్స్ అధిపతి ఎలాన్‌ మస్క్‌ సంపద 130 బిలియన్ డాలర్లు తగ్గింది. అమెజాన్ అధిపతి జెఫ్‌ బెజోస్‌ సంపద 45.2 బిలియన్ డాలర్లు తగ్గి 193 బిలియన్ డాలర్లకు చేరింది. ఫేస్‌బుక్ అధిపతి మార్క్ జుకర్‌బర్గ్‌ సంపద 28.1 బిలియన్ డాలర్లు తగ్గి 179 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. మైక్రోసాఫ్ట్ అధిపతి బిల్‌ గేట్స్‌ సంపద 3.38 బిలియన్ డాలర్ల  మేర తగ్గిపోయింది.