Site icon HashtagU Telugu

Donald Trump: టారిఫ్ వార్‌.. చైనా నిర్ణ‌యంపై స్పందించిన డొనాల్డ్ ట్రంప్.. భ‌య‌ప‌డిందంటూ..

Donald Trump Xi Jinping

Donald Trump Xi Jinping

Donald Trump: అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్ర‌తీకార సుంకాల‌తో ప్ర‌పంచ వ్యాప్తంగా వాణిజ్య యుద్ధం మొద‌ల‌య్యేలా ఉంది. రెండురోజుల క్రితం భార‌త్‌, చైనా స‌హా దాదాపు 180 దేశాల‌పై ట్రంప్ సుంకాలు ప్ర‌క‌టించారు. భార‌త్ ఉత్ప‌త్తుల‌పై 26శాతం, చైనా ఉత్ప‌త్తుల‌పై 34శాతం సుంకాల‌ను విధించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలోనే ట్రంప్ నిర్ణ‌యాన్ని చైనా, కెన‌డా దేశాలు తీవ్రంగా వ్య‌తిరేకించాయి. అమెరికా నిర్ణ‌యం అంత‌ర్జాతీయ వాణిజ్య నిబంధ‌న‌ల‌కు విరుద్ధ‌మ‌ని చైనా ఆరోపించింది. ఏక‌ప‌క్షంగా, ఆర్థిక బెదిరింపుల‌కు ట్రంప్ పాల్ప‌డుతున్నాడ‌ని పేర్కొంది. ఈ క్ర‌మంలో అమెరికా నుంచి దిగుమ‌తి అయ్యే అన్నిర‌కాల వ‌స్తువుల‌పై 34శాతం సుంకాల‌ను చైనా విధించింది.

Also Read: Waqf Bill: వ‌క్ఫ్ బిల్లుపై సుప్రీంలో స‌వాల్ చేసిన కాంగ్రెస్‌, ఎంఐఎం.. ఏం జ‌ర‌గ‌బోతుంది..?

అమెరికా ఉత్ప‌త్తుల‌పై విధించిన సుంకాలు ఏప్రిల్ 10 నుంచి అమ‌ల్లోకి వ‌స్తాయ‌ని ది స్టేట్ కౌన్సిల్ ఆఫ్ టారిఫ్ క‌మిష‌న్ వెల్ల‌డించింది. చైనా నిర్ణ‌యంపై అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. చైనా త‌ప్పిదం చేసింది. వాళ్లు భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. వారికి మ‌రోమార్గం లేద‌ని అన్నారు. ఈ మేర‌కు సొంత‌ సోష‌ల్ మీడియా వేదిక ట్రూత్ సోష‌ల్ లో ట్రంప్ పోస్టు చేశారు. ఇదిలాఉంటే.. తాజా ప‌రిణామాలు ప్రధానంగా అమెరికా, చైనా ద్వైపాక్షిక సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపే అవ‌కాశం ఉంది. అదే జ‌రిగితే మిగతా ప్రపంచ దేశాలు దీన్ని ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అనుభవించవచ్చు. అమెరికా తాజా నిర్ణ‌యాల ప‌ట్ల మిగతా దేశాలు ఎలా రియాక్ట్ అవుతాయో చూడాల్సి ఉంది. మ‌రోవైపు ప్ర‌తీకార సుంకాల‌ను స‌మ‌ర్థించుకుంటున్న ట్రంప్‌.. విదేశీ వ‌స్తువుల‌పై అమెరికా ఆధార‌ప‌డ‌టాన్ని అంతం చేసేందుకు త‌మ తాజా నిర్ణ‌యం ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని చెబుతున్నారు.

Also Read: Earthquake : హైదరాబాద్ వాసులు క్షేమమేనా..? ఎంతవరకు నమ్మొచ్చు..?

ఇదిలాఉంటే.. ట్రంప్ ప్ర‌తీకార సుంకాల నిర్ణ‌యంతో భార‌త్ నుంచి దిగుమ‌తి అయ్యే రొయ్య‌ల‌పై ప్ర‌భావం చూప‌నుంది. భార‌త దేశం నుంచి విదేశాల‌కు ఎగుమ‌తి అవుతున్న మాంస ఉత్ప‌త్తుల్లో రొయ్య‌ల‌ది మూడో స్థానం. ఏపీలో ఉమ్మ‌డి పశ్చిమ గోదావ‌రి జిల్లా నుంచే సింహ‌భాగం ఆక్వా ఉత్ప‌త్తులు ఎగుమ‌తి అవుతున్నాయి. జిల్లాలో 1.20ల‌క్ష‌ల ఎక‌రాల్లో రొయ్య‌లు సాగు చేస్తున్నారు. ప్ర‌తీయేటా ఉత్ప‌త్తి నాలుగు ల‌క్ష‌ల ట‌న్నులు కాగా.. 3.5ల‌క్ష‌ల ట‌న్నుల వ‌ర‌కు విదేశాల‌కు పంపిస్తున్నారు. మొత్తంగా రూ.18వేల కోట్ల వ్యాపారంలో విదేశీ లావాదేవీల వాటానే అధికం. ట్రంప్ విధించిన ప్ర‌తీకార సుంకాలు అమ‌ల్లోకి రావ‌డంతో ఆ ప్ర‌భావం ఏపీలోని ఆక్వా ఉత్ప‌త్తుల‌పై ప‌డింది.