Donald Trump: అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన నాటినుంచి డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అమెరికాలోని అక్రమ వలసదారులను తమతమ దేశాలకు పంపించేయడంతోపాటు.. అమెరికాలోని విదేశీ విద్యార్థులపై అనేక ఆంక్షలు విధిస్తున్నారు. మరోవైపు ఇతరదేశాల నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే వస్తువులపై ట్రంప్ భారీగా టారిఫ్ లు విధించారు. అయితే, తీవ్ర విమర్శలు రావడంతో వెనక్కు తగ్గి.. ప్రతీకార సుంకాలను 90రోజులు మినహాయించారు. చైనాపై మాత్రం భారీగా సుంకాలను పెంచేశారు. చైనాకూడా వెనక్కు తగ్గకపోవటంతో చైనా, అమెరికా దేశాల మధ్య వాణిజ్య యుద్ధం తారాస్థాయికి చేరింది. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటినుంచి బిజీబిజీగా గడుపుతున్న ట్రంప్ ఆరోగ్య పరిస్థితిపై శ్వేతసౌధం కీలక ప్రకటన చేసింది.
Also Read: US-China trade war: అమెరికాకు తలవచ్చిన చైనా..! ప్రతీకార సుంకాలపై ట్రంప్‌నకు కీలక విజ్ఞప్తి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు 78ఏళ్లు. జూన్ 14వ తేదీన ఆయన 79వ వసంతంలోకి అడుగు పెట్టనున్నారు. ప్రస్తుతం అధ్యక్ష హోదాలో విరామం లేకుండా ట్రంప్ బిజీబిజీగా గడుపుతున్నారు. అయితే, ఇటీవల వైద్యులు ట్రంప్ కు వైద్య పరీక్షలు నిర్వహించారు. మేరీలాండ్ రాష్ట్రంలోని వాల్టర్ రీడ్ జాతీయ సైనిక వైద్య కేంద్రంలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. తాజాగా వైద్య పరీక్షల ఫలితాలు వెల్లడయ్యాయి. శ్వేతసౌధం ట్రంప్ వైద్య పరీక్షల నివేదికను విడుదల చేసింది.
Also Read: Tamil Nadu: మరో వివాదంలో తమిళనాడు గవర్నర్.. డీఎంకే, కాంగ్రెస్ విమర్శలు
అమెరికా అధ్యక్షుడిగా, కమాండర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహించేందుకు ఆయన పూర్తి ఫిట్ గా ఉన్నారని వైద్యుడు, నేవీ కెప్టెన్ సీన్ బార్బబెల్లా వెల్లడించారు. ట్రంప్ చురుకైన జీవన శైలే ఆయన ఆరోగ్యానికి గణణీయంగా దోహదపడుతోందని తెలిపారు. ట్రంప్ కళ్ళు, తల, చెవులు, ముక్కు, గొంతుతో సహా ఆయన వివిధ శారీరక వ్యవస్థల పరీక్షలు సాధారణ స్థితిలో ఉన్నాయని, అయితే, గత సంవత్సరం పెన్సిల్వేనియాలో ఆయనపై జరిగిన హత్యాయత్నం కారణంగా ట్రంప్ కుడివైపు కన్ను భాగంలో మచ్చలు ఉన్నాయని వైద్య పరీక్షల నివేదికలో పేర్కొన్నారు.
2020లో ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అప్పట్లో ఆయన బరువు 244 పౌండ్లు. అయితే, ప్రస్తుతం నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఆయన బరువు 224 పౌండ్లకు తగ్గింది. అంటే 20 పౌండ్లు ట్రంప్ తగ్గారని వైద్యుడు బార్బబెల్లా తెలిపారు. ట్రంప్ ఎక్కువగా గోల్ఫ్ ఈవెంట్ లలో పాల్గొంటాడు. ట్రంప్ ఎంత బిజీగా ఉన్నా కొంత సమయాన్ని గోల్ప్ ఆడటానికి, వ్యాయామం చేయడానికి కేటాయిస్తారు. దీంతో ఆయన 78ఏళ్ల వయస్సులోనూ ఫిట్ గా ఉన్నాడని చెబుతున్నారు.