Tariffs War : రెండోసారి అమెరికా అధ్యక్షుడు అయిన డొనాల్డ్ ట్రంప్ అతి దూకుడుతో ముందుకు సాగుతున్నారు. ఈక్రమంలోనే తాజాగా ఆయన కెనడా, మెక్సికో, చైనాలకు షాక్ ఇచ్చారు. ఆ మూడు దేశాల నుంచి అమెరికాకు జరిగే దిగుమతులపై పన్నులను పెంచుతున్నట్లు ప్రకటించారు. కెనడా, మెక్సికోల నుంచి అమెరికాకు జరిగే దిగుమతులపై 25 శాతం, చైనా నుంచి జరిగే దిగుమతులపై 10 శాతం పన్నును విధించేందుకు ఉద్దేశించిన అధికారిక ఫైలుపై ట్రంప్ సంతకాలు చేశారు. దీనిపై అమెరికా ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. ట్రంప్ నిర్ణయంపై కెనడా, మెక్సికో, చైనాలు భగ్గుమన్నాయి. తాము కూడా ఏ మాత్రం తగ్గేదేలేదు అని తేల్చిచెప్పాయి.
Also Read :Congress MLAs Meeting : కాంగ్రెస్ ఎమ్మెల్యేల భేటీలో అసలేం జరిగింది ? సీఎం రేవంత్‌కు నాయిని లేఖ
అమెరికా దిగుమతులపైనా 25 శాతం పన్ను వేస్తాం : కెనడా
అమెరికాపై కెనడా, మెక్సికో దేశాలు(Tariffs War) ప్రతీకార చర్యలకు దిగాయి. ఈక్రమంలోనే 155 బిలియన్ కెనడియన్ డాలర్ల విలువైన అమెరికా దిగుమతులపై 25 శాతం పన్ను విధిస్తామని కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ప్రకటించారు. అమెరికా చర్యలకు ఇదే తమ దేశం ప్రతిస్పందన అని ఆయన వెల్లడించారు. ‘‘అమెరికా నుంచి కెనడాకు జరిగే 155 బిలియన్ కెనడియన్ డాలర్ల విలువైన దిగుమతులపై మేం 25 శాతం చొప్పున ట్యాక్స్ వేస్తాం. ఇందులో 30 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులపై విధించే సుంకం మంగళవారం(ఫిబ్రవరి 4) నుంచి అమల్లోకి వస్తుంది. మిగతా మొత్తంలో 21 రోజుల తర్వాత పన్ను అమల్లోకి వస్తుంది’’ అని జస్టిన్ ట్రూడో తెలిపారు.
మేం అమెరికా దిగుమతులపై పన్ను వేస్తాం : మెక్సికో
అమెరికా నిర్ణయంపై మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షేన్‌బామ్ ఫైర్ అయ్యారు. అమెరికా నుంచి మెక్సికోకు జరిగే దిగుమతులపై టారిఫ్‌లు విధిస్తామని ఆమె వెల్లడించారు. మెక్సికన్ల ప్రయోజనాలకు అనుగుణంగా తాము చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్లాన్ బీని అమలు చేయాలని ఆర్థిక కార్యదర్శిని ఆదేశించారు. డ్రగ్స్ అక్రమ రవాణా గ్రూపులతో మెక్సికో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధాలు లేవని క్లాడియా షేన్‌బామ్ తేల్చి చెప్పారు. తమ ప్రభుత్వం నాలుగు నెలల్లో 20 మిలియన్ డోస్ ఫెంటనిల్ సహా 40 టన్నులకుపైగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుందన్నారు. పదివేల మందిని అరెస్టు చేసిందని ఆమె తెలిపారు. ‘‘డ్రగ్స్‌ను అరికట్టాలని అమెరికా అనుకుంటోంది. అది మంచి విషయమే. అయితే పన్నులు విధిస్తే సమస్య పరిష్కారం కాదు. కలిసి పనిచేయాలి’’ అని క్లాడియా షేన్‌బామ్ సూచించారు.
Also Read :CM Chandrababu : తెలుగు ఓటర్లే టార్గెట్.. ఇవాళ ఢిల్లీలో చంద్రబాబు ప్రచారం
చైనా వార్నింగ్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాన్ని చైనా వాణిజ్య శాఖ ఖండించింది. దీనిపై ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో)లో సవాల్ చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. ఇలాంటి అడ్డదిడ్డమైన నిర్ణయాల వల్ల అమెరికా సమస్యలు తీరకపోగా, సాధారణ ఆర్థిక వ్యవస్థ, వాణిజ్య సహకారాలు దెబ్బతింటాయని చైనా హితవు పలికింది.