Automobiles Tariffs: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏప్రిల్ 2న ప్రపంచంలోని అనేక దేశాలపై సుంకాలను ప్రకటించారు. ఈ సుంకాల వల్ల భారతదేశానికి కూడా అమెరికా నుంచి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ట్రంప్ భారతదేశంపై 26% సుంకాన్ని విధించారు. ఒక నివేదిక ప్రకారం.. ఆటో సుంకాలు (Automobiles Tariffs) విధించడం వల్ల అమెరికాకు సంవత్సరానికి 100 బిలియన్ డాలర్లు అంటే 8.6 లక్షల కోట్ల రూపాయల లాభం వస్తుందని పేర్కొన్నారు. మరో నివేదికలో 25% సుంకాల వల్ల భారతదేశానికి 31 బిలియన్ డాలర్లు అంటే 2.65 లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లవచ్చని తెలిపింది.
మీడియా నివేదికల ప్రకారం.. బోర్గ్ వార్నర్ గ్లోబల్ డైరెక్టర్ ఆఫ్ ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్ చంద్రశేఖర్ కృష్ణమూర్తి సమాచారం మేరకు సుంకాల వల్ల వాహనాల అమ్మకాల్లో మందగమనం ఏర్పడవచ్చు. ఇది వాహనాల ధరల పెరుగుదలకు, డిమాండ్ తగ్గుదలకు దారితీయవచ్చు. ఆటో సెక్టార్ సంవత్సరానికి సుమారు 6.79 బిలియన్ డాలర్ల విలువైన కార్ పార్ట్‌లను అమెరికాకు ఎగుమతి చేస్తుంది. భారతదేశంలోని పరిశ్రమ లబ్ధిదారులు సుంకాలపై మరింత స్పష్టత కోరుతున్నారు. ముఖ్యంగా ఏ నిర్దిష్ట ఆటో పార్ట్‌లపై ఎంత సుంకం విధించబడుతుందనే విషయంలో క్లారిటీ లేదు. అమెరికా ఆటో అసెంబ్లీ ప్లాంట్‌లో తయారైన ఏ కారు కూడా పూర్తిగా అమెరికన్ పార్ట్‌లతో మాత్రమే తయారు కాదని తెలుస్తోంది. చాలా పార్ట్‌లు దిగుమతి చేయబడతాయి.
ట్రంప్ వ్యాపార, తయారీ సలహాదారు పీటర్ నవారో ఈ సుంకాలు ఆటోమేకర్‌లను తమ ఉత్పత్తిని అమెరికన్ ప్లాంట్‌లకు బదిలీ చేయడానికి బలవంతం చేస్తాయని, దీని వల్ల యునైటెడ్ స్టేట్స్‌లో మరిన్ని ఉద్యోగాలు సృష్టించబడతాయని పేర్కొన్నారు.
మరోవైపు ‘మేక్ అమెరికా వెల్తీ అగైన్ ఈవెంట్’ను ఉద్దేశించి మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇలా అన్నారు. “యునైటెడ్ స్టేట్స్ ఇతర దేశాల నుంచి మోటార్‌సైకిళ్లపై కేవలం 2.4% సుంకం వసూలు చేస్తుంది. థాయ్‌లాండ్ఇ, తర దేశాలు చాలా ఎక్కువ ధర వసూలు చేస్తున్నాయి. ఉదాహరణకు భారతదేశం 70%, వియత్నాం 75%, ఇతర దేశాలు అంతకంటే ఎక్కువ సుంకం వసూలు చేస్తున్నాయి. ఈ విపత్తుకు నేను ఈ ఇతర దేశాలను ఏమాత్రం దోషులుగా భావించడం లేదు. నేను మా మునుపటి అధ్యక్షులను, గత నాయకులను దోషులుగా భావిస్తున్నాను. వారు తమ పనిని సరిగా చేయలేదు. ఈ రోజు అర్ధరాత్రి నుంచి మేము విదేశీ తయారీ ఆటోమొబైల్స్ అన్నింటిపై 25% సుంకం విధిస్తాము.” అని ట్రంప్ పేర్కొన్నారు.