Nightclub Collapse: డొమినికన్ రిపబ్లిక్ రాజధాని సాంటో డొమింగోలోని ఒక చారిత్రాత్మక నైట్ క్లబ్ పైకప్పు కూలిపోవడంతో (Nightclub Collapse) కనీసం 113 మంది మరణించారు. 255 మందికి పైగా గాయపడ్డారు. అధికారులు బుధవారం తెలిపిన వివరాల ప్రకారం.. సాంటో డొమింగోలోని ప్రసిద్ధ జెట్ సెట్ నైట్ క్లబ్‌లో సోమవారం, మంగళవారం మధ్య రాత్రి జరిగిన ఈ ఘటనలో మెరెంగ్యూ గాయని రూబీ పెరెజ్ ప్రదర్శన ఇస్తున్న సమయంలో పైకప్పు నుంచి సిమెంట్ రాలడం మొదలైంది. కాసేపట్లోనే మొత్తం పైకప్పు కూలిపోయింది. అధికారుల ప్రకారం.. డాన్స్ ఫ్లోర్‌పై నృత్యం చేస్తున్న కనీసం 113 మంది ఈ ప్రమాదంలో మరణించారు. డజన్ల మంది మరొకరు శిథిలాల కింద చిక్కుకున్నారు. ఈ ఘటనలో 255 మందికి పైగా గాయపడినట్లు తెలిపారు.
ఎమర్జెన్సీ ఆపరేషన్స్ సెంటర్ డైరెక్టర్ మాన్యువల్ మెండెజ్ మాట్లాడుతూ.. మరణించిన వారిలో పెరెజ్ కూడా ఉన్నారని చెప్పారు. శిథిలాల్లో చిక్కుకున్న వారిలో బతికి ఉండే అవకాశం ఉన్న వ్యక్తుల కోసం రెస్క్యూ బృందాలు అలుపెరగక శోధిస్తున్నాయని ఆయన తెలిపారు. “మేము శిథిలాల కింద ఉన్న వ్యక్తుల కోసం అవిశ్రాంతంగా పని చేస్తున్నాము” అని మెండెజ్ అన్నారు. ఈ ఘటనలో 113 మంది మరణాలు నిర్ధారణ అయ్యాయని, అయితే వీరిలో కేవలం 32 మంది గుర్తింపు మాత్రమే ఇప్పటివరకు సాధ్యమైందని ఆయన వెల్లడించారు.
Also Read: MP Lavu krishna devarayalu: జగన్ వ్యాఖ్యలపై అమిత్ షాకు టీడీపీ ఎంపీ లేఖ.. ఏమన్నారంటే..?
స్థానిక మీడియా వార్తల ప్రకారం.. మరణించిన వారిలో ఒక హృదయ వైద్య నిపుణుడు, ఒక ప్రభుత్వ వాస్తుశిల్పి, ఒక రిటైర్డ్ పోలీసు అధికారి, యువజన మంత్రిత్వ శాఖ ఉపమంత్రి సోదరుడు ఉన్నారు. డొమినికన్ రిపబ్లిక్ ‘ప్రొఫెషనల్ బేస్‌బాల్ లీగ్’ ప్రతినిధి ‘ది అసోసియేటెడ్ ప్రెస్’కు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటనలో MLB (మేజర్ లీగ్ బేస్‌బాల్) పిచ్చర్ ఆక్టవియో డోటెల్, ఆటగాడు టోనీ ఎన్రిక్ బ్లాంకో కాబ్రెరా కూడా మరణించారు. వాయవ్య ప్రాంతం మోంటెక్రిస్టీ గవర్నర్, ఏడుసార్లు MLB ఆల్-స్టార్ (లీగ్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాడు) నెల్సన్ క్రూజ్ సోదరి నెల్సీ క్రూజ్ కూడా మరణించిన వారిలో ఉన్నారు. నెల్సీ శిథిలాల కింద చిక్కుకున్న సమయంలో రాష్ట్రపతి లూయిస్ అబినాడర్‌కు ఫోన్ చేసి ఈ ప్రమాదం గురించి సమాచారం అందించారని, ఆ తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించినట్లు అధికారులు తెలిపారు.
ఈ ఘటనలో పెరెజ్ సంగీత బృందంలోని సాక్సోఫోన్ వాయిద్యకారుడు లూయిస్ సోల్స్, అనేక మంది సిబ్బంది, సైన్యంలోని ఒక సైనికుడు కూడా మరణించారు. ఆర్థిక సేవలు అందించే సంస్థ గ్రూపో పాపులర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ప్రమాదంలో సంస్థకు చెందిన ముగ్గురు ఉద్యోగులతో పాటు, AFP పాపులర్ బ్యాంక్ అధ్యక్షుడు మరియు ఆయన భార్య కూడా మరణించారు. నైట్ క్లబ్ పైకప్పు కూలిపోవడానికి గల కారణం ఇప్పటివరకు స్పష్టంగా తెలియలేదు. జెట్ సెట్ నైట్ క్లబ్ భవనం చివరిసారిగా ఎప్పుడు తనిఖీ చేయబడిందనే విషయం కూడా స్పష్టంగా లేదు. నైట్ క్లబ్ ఒక ప్రకటన విడుదల చేస్తూ.. అధికారులతో సహకరిస్తున్నట్లు తెలిపింది.