World Red Cross Day 2025: రెడ్‌క్రాస్ సంస్థను 1863లో హెన్రీ డ్యూనాంట్ అనే స్విస్ వ్యక్తి స్థాపించారు. 1859లో ఇటలీ మరియు ఫ్రాన్స్-ఆస్ట్రియా మధ్య జరిగిన సల్ఫెరినో యుద్ధంలో గాయపడిన సైనికులకు చికిత్స అందించాల్సిన అవసరం చూసిన ఆయన, ఈ అవసరాన్ని తీర్చేందుకు ఒక స్వచ్ఛంద సంస్థను ప్రారంభించారు. ఇది తర్వాత అంతర్జాతీయ స్థాయికి ఎదిగి, ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ ఆర్గనైజేషన్ మరియు ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్ క్రాస్ అనే పేర్లతో ప్రపంచ వ్యాప్తంగా సేవలందిస్తోంది. అయితే, హెన్రీ డ్యూనాంట్ జన్మదినమైన మే 8వ తేదీను పురస్కరించుకుని ప్రతి సంవత్సరం వరల్డ్ రెడ్‌క్రాస్ డేగా జరుపుకుంటారు.
రెడ్‌క్రాస్ లోగో:
Red Cross Logo
ఎర్ర రంగులో సమాన భుజాల క్రాస్ ఆకారంలో ఉన్న ఈ చిహ్నం, రెడ్‌క్రాస్ సంస్థకు గుర్తుగా ఉంటుంది. ఇది యుద్ధ సమయంలో తటస్థతను సూచించే చిహ్నంగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఈ లోగోను వైద్య పరికరాలు, ఆసుపత్రి జెండాలు వంటి వాటిపై వాడతారు.
రెడ్‌క్రాస్ సేవలు యుద్ధ సమయంలో గాయపడిన వారికి చికిత్స, తిరుగుబాట్ల సమయంలో సహాయం, అత్యవసర వైద్య సేవలతో పాటు దాతృత్వ కార్యక్రమాలను కూడా కలిగి ఉంటాయి. ఈ చిహ్నం యుద్ధం నుంచి బయటపడ్డ వారికి రక్షణగా గుర్తించబడుతుంది.
రెడ్‌క్రాస్ కార్యకలాపాలు:
రెడ్‌క్రాస్ శాంతియుత సమయాల్లో కూడా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఇవిలో ముఖ్యమైనవి:
-
మానవతా విలువలను ప్రోత్సహించడం
-
ప్రజల ఆరోగ్యంపై అవగాహన కల్పించడం
-
ప్రకృతి విపత్తుల సమయంలో సహాయం చేయడం
-
ఆరోగ్య శిబిరాలు, రక్తదాన కార్యక్రమాలు నిర్వహించడం
-
సమాజ అభివృద్ధికి కృషి చేయడం
భారతదేశంలో రెడ్‌క్రాస్:
Indian Red Cross Society- IRCS
భారతదేశంలో రెడ్‌క్రాస్ 1920 లో లెజిస్లేటివ్ అసెంబ్లీ చట్టం ద్వారా స్థాపించబడింది. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ లో ఉంది. దేశవ్యాప్తంగా అన్ని శాఖలతో కలసి ఇది ప్రకృతి విపత్తులు, ఆరోగ్య రంగంలో సేవలను అందిస్తూ క్రియాశీలకంగా పని చేస్తోంది.