వచ్చే ఏడాది నుంచి న్యూయార్క్ లో దీపావళి సందర్భంగా ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది. ఈమేరకు నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్ ఈ ప్రకటన చేశారు. దీపావళిని పాఠశాలలకు సెలవుగా ప్రకటించాలని గత కొన్నేళ్లుగా నగరంలో నివసిస్తున్న లక్షలాది మంది భారతీయుల నుంచి డిమాండ్ పెరుగుతోందని ఆడమ్స్ చెప్పారు. చట్టం ఆమోదించిన తర్వాత వచ్చే ఏడాది నుంచి దీపావళి నాడు పాఠశాలలకు సెలవు ప్రకటిస్తారు. న్యూయార్క్ అసెంబ్లీ సభ్యుడు రాజ్ కుమార్, దీపావళికి స్కూల్స్ సెలవుల కోసం నగరంలోని పాఠశాల క్యాలెండర్ లో ఆప్షన్ లేదంటూ హైలైట్ చేశారు. దీంతో ఈ వారం క్యాలెండర్ లో దీపావళి హాలిడేను చేర్చేందుకు అనుమతించే చట్టాన్ని ప్రవేశపెట్టారు. న్యూయార్క్ విద్యా హక్కు చట్టాల ప్రకారం…కనీసం పాఠశాల 180రోజులు పనిచేయాలి.
కాగా న్యూయార్క్ లో భారతీయులు ఎక్కువగా నివసిస్తున్నారు. దీపాల పండగ గురించి మేము చాలా నేర్చుకున్నాం. అందుకే ప్రతిఏడాది దీపావళి రోజును సెలవు దినంగా ప్రకటించాలని నిర్ణయించామని ఆడమ్స్ తెలిపారు. దీపావళిని పబ్లిక్ హాలిడేగా ప్రకటించినందుకు భారత కాన్సుల్ జనరల్ రణధీర్ జైస్వాల్ ధన్యవాదాలు తెలిపారు. భారతీయ-అమెరికన్ కమ్యూనిటీ చాలా కాలంగా దీపావళికి సెలవు ఇవ్వాలని డిమాండ్ చేస్తోందని జైస్వాల్ తెలిపారు. దీంతో వచ్చే ఏడాది నుంచి పాఠశాలలకు సెలవు ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు.