Students Clashes : బంగ్లాదేశ్ విద్యార్థి సంఘాల తీరు వివాదాస్పదంగా మారుతోంది. ఆగస్టు 5 వరకు షేక్ హసీనాపై పోరాడి విజయం సాధించిన విద్యార్థి సంఘాలు, ఇప్పుడు ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకుంటూ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నాయి. బంగ్లాదేశ్ పారా మిలిటరీలో అన్సార్ ఫోర్స్ అనే విభాగం ఉంది. ఈ విభాగంలో పనిచేసే వారు తమ ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలంటూ రాజధాని ఢాకాలో నిరసనకు దిగారు. అయితే ఈ నిరసన కార్యక్రమంపై విద్యార్థి సంఘాల నేతలు దాడికి దిగారు. దీంతో నిరసనల్లో కూర్చున్న అన్సార్ ఫోర్స్ సభ్యులు కూడా తిరగబడ్డారు. ఈ గొడవల్లో ఇరువర్గాలు(Students Clashes) ఒకరిపై ఒకరు ఇటుకలు విసురుకుంటూ వెంబడించుకున్నారు. ఈ గొడవల్లో దాదాపు 50 మంది గాయపడ్డారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు, ఆర్మీ రంగంలోకి దిగాయి.
We’re now on WhatsApp. Click to Join
ఆదివారం రాత్రి రాజధాని ఢాకాలో ఉన్న బంగ్లాదేశ్ సచివాలయం సమీపంలో జరిగిన ఈ గొడవల వార్త ఆలస్యంగా ఇవాళ ఉదయం వెలుగులోకి వచ్చింది. తమపై దాడికి పాల్పడేందుకు వచ్చిన విద్యార్థి సంఘం నాయకుడు, ఆపద్ధర్మ ప్రభుత్వ సలహాదారు నహీద్ ఇస్లాంను కూడా అన్సార్ ఫోర్స్ సభ్యులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలతో బంగ్లాదేశ్‌లోని కొత్త ప్రభుత్వం అలర్ట్ అయింది. బంగ్లాదేశ్ హోంశాఖ సలహాదారుడు, లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) జహంగీర్ ఆలం చౌదరి చొరవతో అన్సార్ ఫోర్స్ సభ్యులు నిరసన విరమించారు. ఉద్యోగాల క్రమబద్ధీకరణ అంశాన్ని తప్పకుండా పరిశీలిస్తామనే హామీ లభించడంతో అన్సార్ ఫోర్స్ సభ్యులు వెనక్కి తగ్గారు. అన్సార్ ఫోర్స్ సభ్యులకు వ్యతిరేకంగా సోషల్ మీడియా వేదికగా బంగ్లాదేశ్ విద్యార్థి సంఘాలు పోస్టులు పెడుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. అన్సార్ ఫోర్స్ ద్వారా నిరంకుశ శక్తులు మళ్లీ బంగ్లాదేశ్‌లోకి చొరబడే ప్రయత్నం చేస్తున్నాయని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నారు. అన్సార్ ఫోర్స్‌కు సారథ్యం వహిస్తున్న అమీనుల్ హఖ్‌ను వాళ్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బంగ్లాదేశ్‌లో పూర్తిస్థాయి ప్రభుత్వం ఏర్పడే వరకు ఈ పరిణామాలు దేనికి దారితీస్తాయో వేచిచూడాలి.