Site icon HashtagU Telugu

Pakistan Floods: వరద గుప్పిట్లో పాక్.. జల ప్రళయాన్ని అద్దం పట్టేలా నాసా ఫోటోలు!!

Pakistan Whole Map Nasa Imresizer

Pakistan Whole Map Nasa Imresizer

పాకిస్థాన్ ను మునుపెన్నడూ లేనంత భారీగా వరదలు ముంచెత్తుతున్నాయి. హిమాలయాలు కరిగిపోయి..
సింధు నది పోటెత్తడంతో చాలా ప్రాంతం జలమయంగా మారింది. ఏకంగా వంద కిలోమీటర్ల వెడల్పున ఓ సరస్సులా మారిపోయింది. ఈ స్థితిని అద్దం పట్టేలా.. వరదలకు ముందు పాకిస్థాన్, వరదల తర్వాత పాకిస్థాన్ చిత్రాలను నాసా ఎర్త్ అబ్జర్వేటరీ తాజాగా విడుదల చేసింది. నాలుగు రోజుల కిందట నాసాకు చెందిన మోడిస్ శాటిలైట్ సెన్సర్ తో.. పాకిస్థాన్ లోని సింధ్ రాష్ట్రానికి సంబంధించిన వరద చిత్రాలను తీశారు. ఇందులో ఆకుపచ్చ రంగులో ఉన్నవి అడవులు, పొలాలు కాగా.. గోధుమ రంగులో ఉన్నవి సాధారణ భూములు, ప్రాంతాలు. ఇక ముదురు నీలం రంగులో ఉన్నవన్నీ నీళ్లు.

* పాకిస్థాన్ లో అతి భారీ వర్షాలు, వరదల కారణంగా దాదాపు 100 కిలోమీటర్ల వెడల్పున, అంతకు మించిన పొడవుతో భారీ సరస్సులా ఏర్పడిందని నాసా వెల్లడించింది.

* వరదలకు సంబంధించి ఆగస్టు 4న, అదే నెల 28న తీసిన రెండు చిత్రాలను పోల్చుతూ నాసా విడుదల చేసింది. తొలి చిత్రంలో సింధ్ ప్రావిన్స్ సాధారణంగా ఉండగా.. రెండో చిత్రంలో నీట మునిగి కనిపిస్తుండటం గమనార్హం.

* పాకిస్థాన్ లో దాదాపు నెల రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 30 ఏళ్ల వార్షిక సగటు కంటే ఏకంగా ఐదారు రెట్లు భారీగా వరదలు పోటెత్తడంతో 1,100 మందికిపైగా మరణించారు.

* సుమారు 3,500 కిలోమీటర్ల పొడవునా రోడ్లు కొట్టుకుపోగా.. 150 వంతెనలు దెబ్బతిన్నాయి.

* సింధూ నదికి వరదల వల్ల పాక్ లోని పలు పరీవాహక రాష్ట్రాలకు చెందిన దాదాపు 3.30 కోట్ల మంది ప్రభావితులు అయ్యారు. 10 లక్షల ఇళ్లు దెబ్బతిన్నాయి.

* పాక్ లోని గిల్గీట్ బాల్టిస్తాన్ , ఖైబర్ పఖ్టున్ ఖా ప్రాంతాల్లో ప్రవహించే నదుల నీటిమట్టాలు ప్రమాదకర స్థాయిలో ఉన్నాయి. దీంతో వరదలకు ముందు ఆకుపచ్చ రంగులో ఉన్న ఈ పరీవాహక ప్రాంతాల మ్యాప్ కాస్త.. వరదల తర్వాత నీలం రంగులోకి మారిపోవడాన్ని నాసా విడుదల చేసిన ఫోటోలో చూడొచ్చు.

* సింధు నదీ పరీవాహక ప్రాంతంలోని కంబర్, షికార్ పూర్ ప్రాంతాల్లో సగటు కంటే 500 శాతం ఎక్కువగా వర్షపాతం నమోదైంది.