Site icon HashtagU Telugu

Trump Asim Deal : పహల్గాం ఉగ్రదాడికి ముందు.. ట్రంప్‌ ఫ్యామిలీతో పాకిస్తాన్ బిగ్ డీల్ ?

Donald Trump Asim Munir Pakistan Pak Army Chief Trump Asim Deal

Trump Asim Deal : ఏప్రిల్ 22న జమ్మూకశ్మీరులోని పహల్గాంలో ఉగ్రదాడి జరిగింది. ఈ దాడి జరగడానికి కొన్ని వారాల ముందు ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య ఒక డీల్ జరిగింది.  అమెరికాకు చెందిన ప్రైవేట్ క్రిప్టోకరెన్సీ కంపెనీ వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్, పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్ మధ్య ఒప్పందం జరిగింది. వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ కంపెనీలో డొనాల్డ్ ట్రంప్ కుమారులు ఎరిక్ ట్రంప్, డొనాల్డ్ ట్రంప్ జూనియర్, అల్లుడు జారెడ్ కుష్నర్‌లకు ఏకంగా  60శాతం వాటా ఉంది. అంటే ఆ కంపెనీపై పూర్తి పట్టు డొనాల్డ్ ట్రంప్ కుటుంబానికే ఉందనే విషయం స్పష్టంగా తెలిసిపోతోంది. ఏప్రిల్ నెలలో వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్‌, పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్‌ మధ్య ఒప్పందం కుదిరిందని  నిరూపించే ‘లెటర్ ఆఫ్ ఇంటెంట్’ సైతం వెలుగులోకి వచ్చింది.

Also Read :Operation Sindoor : ‘నాగోర్నో-కారోబాఖ్‌’ ఫార్ములాతో భారత్ – పాక్ ఢీ.. భారతే నెగ్గింది

ఆసిమ్ మునీర్ దగ్గరుండి మరీ.. 

ఈ డీల్‌ జరగడంలో పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్(Trump Asim Deal) కీలక పాత్ర పోషించారట. అమెరికా నుంచి పాకిస్తాన్‌కు వచ్చిన వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ కంపెనీ ప్రతినిధి బృందానికి ఆసిమ్ మునీర్ దగ్గరుండి మరీ సకల మర్యాదలు చేశారట. ఈ ప్రతినిధి బృందానికి ట్రంప్‌ వ్యాపార భాగస్వామి స్టీవ్ విట్కాఫ్ కుమారుడు జాకరీ విట్కాఫ్ సారథ్యం వహించారట. జాకరీ విట్కాఫ్‌ ప్రస్తుతం మిడిల్ ఈస్ట్‌‌లో అమెరికా ప్రత్యేక రాయబారిగా కూడా వ్యవహరిస్తున్నారు. అమెరికా అధ్యక్ష పదవిని అడ్డం పెట్టుకొని ఏ రేంజులో డొనాల్డ్ ట్రంప్ తన వ్యాపారాలను పెంచుకుంటున్నారో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు.  పాకిస్తాన్‌కు వచ్చిన జాకరీ విట్కాఫ్‌ బృందం ప్రధాని షాబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌‌లతో రహస్య సమావేశాలు కూడా జరిపిందట. బహుశా ప్రైవేట్ క్రిప్టోకరెన్సీ కంపెనీ వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్‌లో వారికి కూడా మైనారిటీ వాటాలను ఇచ్చి ఉండొచ్చు.

Also Read :What is Teesta Prahar: ‘తీస్తా ప్రహార్‌’.. ఏమిటిది ? భారత్, బంగ్లాదేశ్ యుద్ధం జరగబోతోందా ?

ఎందుకీ డీల్ ? 

ఈ ఒప్పందం కుదిరిన వెంటనే పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్ సలహాదారుడిగా బైనాన్స్ వ్యవస్థాపకుడు ఛాంగ్‌పెంగ్ జావోను పాకిస్తాన్ ప్రభుత్వం నియమించింది. ఈ ఒప్పందం వల్ల పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థలో బ్లాక్‌చైన్ టెక్నాలజీని ప్రవేశపెట్టడం, ఆస్తుల టోకనైజేషన్, స్టేబుల్‌ కాయిన్ అభివృద్ధి, డిసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ పై పైలట్ ప్రాజెక్టులకు అనుమతి లభిస్తుంది. పాకిస్తాన్‌లో డిజిటల్ ఫైనాన్స్ విస్తరణతో పాటు బ్యాంకింగ్, క్రెడిట్, ఇన్సూరెన్స్, పెట్టుబడులు, పెన్షన్ వంటి సేవల్ని అందరికీ అందుబాటులోకి తీసుకొస్తారు. ఈ ఒప్పందంపై అటు ట్రంప్ కుటుంబం కానీ, ఇటు వైట్ హౌస్ కానీ ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.