Site icon HashtagU Telugu

AI Cancer Vaccine : ఏఐతో 48 గంటల్లోనే క్యాన్సర్ వ్యాక్సిన్.. ఎలాగో చెప్పేసిన ఒరాకిల్ ఛైర్మన్

Ai Cancer Vaccine Donald Trump Oracles Larry Ellison

AI Cancer Vaccine : ‘‘ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ (ఏఐ) టెక్నాలజీతో క్యాన్సర్ వ్యాక్సిన్ తయారీ మరెంతో దూరంలో లేదు’’.. ఈ విషయాన్ని చెప్పింది మరెవరో కాదు ప్రఖ్యాత టెక్ కంపెనీ ఒరాకిల్ ఛైర్మన్ ల్యారీ ఎలిసన్. ఈయన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎదుటే ఈవిషయాన్ని ఇవాళ వెల్లడించారు. ఈ వ్యాఖ్య గురించి ల్యారీ ఎలిసన్ అక్కడే చక్కగా వివరించారు.

Also Read :Chalapati Selfie With Wife : భార్యతో సెల్ఫీ దిగి చలపతి దొరికిపోయాడు.. మావోయిస్టు అగ్రనేత ఎన్‌కౌంటర్‌కు కారణమదే

వైద్య చరిత్రలో కొత్త మైలురాయి

‘‘వైద్యసేవల రంగంలో ఏఐ టెక్నాలజీ అద్బుతాలను క్రియేట్ చేయబోతోంది. క్యాన్సర్ వ్యాక్సిన్‌ను(AI Cancer Vaccine) కూడా అది క్రియేట్ చేస్తుంది. క్యాన్సర్‌ను త్వరితగతిన గుర్తిస్తే దాని చికిత్స సాధ్యమే. ఇందుకోసం మనకు ఏఐ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. క్యాన్సర్ చికిత్సతో పాటు ఆ వ్యాధికి విరుగుడుగా పనిచేసే వ్యాక్సిన్ తయారీలోనూ ఏఐ సాంకేతికతను మనం వాడుకోవచ్చు. నిజంగా ఇది మానవ వైద్య చరిత్రలో కొత్త మైలురాయిని క్రియేట్ చేస్తుంది’’ అని  ఒరాకిల్ ఛైర్మన్ ల్యారీ ఎలిసన్ వివరించారు.

క్యాన్సర్ తొలిదశలో ఉండగా..

‘‘క్యాన్సర్ తొలిదశలో ఉన్నప్పుడు మనుషుల శరీరంలోని రక్తంలో చిన్నపాటి ట్యూమర్ల (కణుతులు) తునకలు కదలాడుతాయి. అవి చాలా సూక్ష్మమైన సైజులో ఉంటాయి. రక్తపరీక్షల్లో వాటిని గుర్తించవచ్చు. ఈవిధంగా చిన్నపాటి ట్యూమర్లను రక్తపరీక్షల్లో గుర్తిస్తే.. వాటిని ఏఐ టెక్నాలజీ విశ్లేషించగలదు. అది క్యాన్సరా ? కాదా ? అనే విషయాన్ని ఏఐ నిర్ధారించగలదు. క్యాన్సర్ కారక జన్యువు ఆ ట్యూమర్లలో ఉందని ఏఐ పరీక్షలో తేలితే.. సదరు రోగికి వెంటనే క్యాన్సర్ వ్యాక్సిన్‌ను అందించాలి. ఈ వ్యాక్సిన్‌ను కూడా సదరు క్యాన్సర్ కారక జన్యువు ఆధారంగానే తయారు చేసేందుకు మనకు ఏఐ టెక్నాలజీ దోహదం చేస్తుంది. ఏఐ టెక్నాలజీని వాడుకొని క్యాన్సర్ వ్యాధిని ఆదిలోనే అంతం చేయగల ఎంఆర్ఎన్‌ఏ వ్యాక్సిన్‌ను 48 గంటల్లోగా తయారు చేయొచ్చు. తద్వారా ఆ వ్యక్తికి వచ్చిన క్యాన్సర్‌కు అనుగుణమైన వ్యాక్సిన్‌ను తయారు చేయడం, చికిత్సను అందించడం సాధ్యమవుతుంది’’ అని ఒరాకిల్ ఛైర్మన్ ల్యారీ ఎలిసన్ వివరించారు.

Also Read :Ayodhya Ram : అయోధ్య రామయ్య ప్రాణప్రతిష్ఠకు ఏడాది.. దర్శన ముహూర్తం ఉంటుందా ?

రూ.43 లక్షల కోట్లతో ‘స్టార్ గేట్’ ఏఐ కంపెనీ

టెక్‌ దిగ్గజ కంపెనీలు ఓపెన్‌ ఏఐ, ఒరాకిల్‌, ప్రముఖ ఆర్థిక సంస్థ సాఫ్ట్‌ బ్యాంక్‌ కలిసి స్టార్‌గేట్ పేరుతో కంపెనీని ఏర్పాటు చేయనున్నాయి. ఇందులో అమెరికా ప్రభుత్వానికి కూడా భాగస్వామ్యం ఉంటుంది. ఆ కంపెనీలతో పాటు అమెరికా ప్రభుత్వం కూడా దీనికి నిధులను, మౌలిక వసతులను సమకూరుస్తుంది. రాబోయే ఐదేళ్లలో స్టార్ గేట్ కంపెనీలో దాదాపు రూ.43 లక్షల కోట్ల పెట్టుబడులు పెడతామని మూడు కంపెనీలు ప్రకటించాయి.  ఈ ప్రాజెక్టు ద్వారా ఏఐ టెక్నాలజీకి అవసరమైన మౌలిక సదుపాయాలను అమెరికాలో తయారు చేస్తారు. తద్వారా అమెరికాలో లక్షలాది మందికి ఉద్యోగాలు వస్తాయని దేశాధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు.