విహారయాత్రకు బయలుదేరిన ఓ క్రూయిజ్ షిప్ లో కరోనా కలకలం సృష్టించింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా అదుపులోకి వచ్చినప్పటికీ పలు దేశాల్లో మాత్రం కోరలు చాస్తోంది. తాజాగా న్యూజిలాండ్ నుంచి ఆస్ట్రేలియా వెళ్తున్న నౌకలో పెద్ద ఎత్తున కరోనా కేసులు వెలుగు చూశాయి. అందులో మొత్తం 4,600 మంది ప్రయాణిస్తుండగా.. 800 మందికి కరోనా సోకింది. ప్రస్తుతం నౌకను సిడ్నీ తీరంలో నిలిపివేశారు. కరోనా సోకిన వారిని ఐసోలేషన్‌లో ఉంచామని క్రూజ్ ఆపరేటర్ తెలిపారు. ఇటీవల కేసులు పెరుగుతుండడంతో తమ నౌకలలో కరోనా ప్రొటోకాల్ ను అమలు చేస్తున్నామని కంపెనీ ప్రెసిడెంట్ మార్గరెట్ ఫిట్జెరాల్డ్ తెలిపారు.
ఆస్ట్రేలియాలోని సిడ్నీలో కోవిడ్-19తో సుమారు 800 మంది ప్రయాణికులతో కూడిన హాలిడే క్రూయిజ్ షిప్ డాక్ చేయబడింది. మెజెస్టిక్ ప్రిన్సెస్ క్రూయిజ్ షిప్ న్యూజిలాండ్ నుండి బయలుదేరి సర్క్యులర్ క్వే వద్దకు చేరుకుంది. ఓడ డాక్ చేసినప్పుడు దాదాపు 4,600 మంది ప్రయాణికులు, సిబ్బంది అందులో ఉన్నారు. అంటే ఐదుగురిలో ఒకరికి కోవిడ్ ఉంది. ఈ ఘటన 2020 ప్రారంభంలో రూబీ ప్రిన్సెస్ క్రూయిజ్ షిప్ కోవిడ్ వ్యాప్తిని గుర్తు చేస్తుంది. అప్పుడు 900 మందికిపైగా కరోనా పాజిటివ్ రాగా.. 28 మంది మరణించారు. ఇప్పుడు మెజిస్టిక్ ప్రిన్సెస్ నౌకలో నుంచి ప్రయాణికులను బయటకు తీసుకువచ్చే మార్గాలను పరిశీలిస్తున్నట్లు ఆస్ట్రేలియా అంతర్గత వ్యవహారాల మంత్రి క్లేర్ ఓ నెయిల్ మీడియాకు తెలిపారు. ఇటీవల ఆస్ట్రేలియాలో కరోనా కేసులు పెరుగుతున్నట్లు అక్కడి ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. న్యూ సౌత్ వేల్స్‌లో శుక్రవారం నుండి వారం వ్యవధిలోనే 19, 800 కేసులు నమోదయ్యాయి.