Site icon HashtagU Telugu

Israel Vs Hamas : హమాస్ – ఇజ్రాయెల్ యుద్ధం ఆపే దిశగా కీలక అడుగు

Israel Vs Hamas

Israel Vs Hamas

Israel Vs Hamas :  గతేడాది అక్టోబరు 7న మొదలైన ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం ఇంకా కొనసాగుతోంది. చిన్నపాటి మిలిటెంట్ సంస్థ హమాస్‌తో శక్తివంతమైన ఇజ్రాయెల్ దేశం నేటికీ పోరాడుతూనే ఉంది.  తాజాగా ఈజిప్టు బార్డర్‌లోని పాలస్తీనా ప్రాంతం రఫాపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో మరో 22 మంది సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. రఫా అనేది చాలా చిన్న విస్తీర్ణంలో ఉన్న ప్రాంతం. ఇక్కడ దాదాపు 15 లక్షల మంది పాలస్తీనా ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. పాలస్తీనాలోని ఇతర నగరాలను ఇజ్రాయెల్ ఆర్మీ ఆక్రమించడంతో ప్రజలంతా రఫాలో ఆశ్రయం పొందారు.  ఇదే అదునుగా ఇక్కడ కూడా ఇజ్రాయెల్ ఆర్మీ బాంబుల వర్షం కురిపిస్తోంది. రఫాపై ఇజ్రాయెల్ దాడుల తీవ్రత పెరిగితే.. ప్రాణం నష్టం మరింత పెరిగే ముప్పు ఉంది. మరో 20వేల మంది అక్కడ ప్రాణాలు కోల్పోయే గండాన్ని ఎదుర్కొంటారు. అందుకే ఇప్పుడు అమెరికా రంగంలోకి దిగింది.

We’re now on WhatsApp. Click to Join

ఈజిప్టు, ఖతర్ దేశాలతో కలిసి ఇజ్రాయెల్‌తో అమెరికా దౌత్యం నెరుపుతోంది. 40 రోజుల కాల్పుల విరమణ కోసం ఇజ్రాయెల్‌ ప్రతిపాదన చేసిందని ఆ దేశాలు వెల్లడించాయి. 40 మంది కంటే తక్కువ ఇజ్రాయెలీ బందీలను హమాస్ సంస్థ విడుదల చేసినా.. తాము 40 రోజుల కాల్పుల విరమణకు సిద్ధమేనని ఇజ్రాయెల్ తెలిపిందని పేర్కొన్నాయి. ప్రస్తుతం హమాస్‌ చెరలో దాదాపు 133 మంది ఇజ్రాయెలీ బందీలు ఉన్నారు. వీరిలో దాదాపు 30మంది ఇజ్రాయెల్ (Israel Vs Hamas) దాడుల్లోనే చనిపోయి ఉంటారని తెలుస్తోంది. 40 మంది ఇజ్రాయెలీ బందీల విడుదలకు ప్రతిగా పాలస్తీనా ఖైదీలను తాము విడిచిపెడతామని ఇజ్రాయెల్ అంటోంది. మరోవైపు హమాస్‌ మాత్రం.. 40 రోజులు కాకుండా శాశ్వత కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించాలని డిమాండ్ చేస్తోంది. కాల్పుల విరమణ అంశంపై అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ స్వయంగా ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహుకు కాల్ చేసి మాట్లాడినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.

ఇజ్రాయెల్​కు ఐసీసీ భయం

మరోవైపు  ఇజ్రాయెల్‌కు అంతర్జాతీయ నేర న్యాయస్థానం (ఐసీసీ) భయం పట్టుకుంది. 2014 నాటి గాజా యుద్ధంలో ఇజ్రాయెల్‌, హమాస్‌ మిలిటెంట్లు యుద్ధనేరాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై అంతర్జాతీయ నేర న్యాయస్థానం మూడేళ్ల క్రితమే విచారణను చేపట్టింది. ఆనాటి గాజా యుద్ధం కేసులో తమ సైనిక అధికారులు, నేతలపై ఐసీసీ అరెస్టు వారెంట్లు జారీ చేయొచ్చనే  వార్తలు వస్తుండటంతో ఇజ్రాయెల్ టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇజ్రాయెల్ విదేశాంగశాఖ ఇతర దేశాల్లోని తమ రాయబార కార్యాలయాలకు దీనిపై అలర్ట్ నోటిఫికేషన్ పంపిందట. ఒకవేళ వారెంట్లు జారీ అయితే తమ అధికారులను ఆయా దేశాల్లో అరెస్టుచేసే ప్రమాదం ఉందని ఇజ్రాయెల్ భావిస్తోంది. ప్రస్తుత గాజా యుద్ధంలో కూడా ఇజ్రాయెల్‌ నరమేధం జరిపిందా లేదా అన్న అంశంపైనా ఐసీసీ దర్యాప్తు చేస్తోంది.

Also Read :TDP : చంద్రబాబు కీలక నిర్ణయం.. ఆరుగురు నేతలపై వేటు

Exit mobile version