GPS Jamming : అల్లాడుతున్న విమానాలు.. చుక్కలు చూపిస్తున్న ‘జీపీఎస్‌ జామింగ్‌’

GPS Jamming : నావిగేషనల్‌ సిగ్నల్స్‌ ఆధారంగానే విమానాలు ఆకాశ మార్గంలో వేగంగా దూసుకుపోతుంటాయి.

  • Written By:
  • Updated On - March 26, 2024 / 06:54 PM IST

GPS Jamming : నావిగేషనల్‌ సిగ్నల్స్‌ ఆధారంగానే విమానాలు ఆకాశ మార్గంలో వేగంగా దూసుకుపోతుంటాయి. అయితే గత రెండు రోజులుగా తూర్పు ఐరోపా దేశాల పరిధిలోని బాల్టిక్‌ ప్రాంతాన్ని నకిలీ జీపీఎస్‌ సిగ్నల్స్‌ సమస్య పట్టి పీడిస్తోంది.  వీటికి కారణం రష్యానే అయి ఉండొచ్చని పలు ఐరోపా దేశాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. నకిలీ జీపీఎస్‌ సిగ్నల్స్‌ సమస్య కారణంగా గత రెండు రోజుల్లో 1614 విమాన సర్వీసులు ప్రభావితమయ్యాయని సమాచారం. పోలాండ్‌, దక్షిణ స్వీడన్‌, ఫిన్లాండ్‌ ప్రాంతాల్లో ఈ సమస్య అధికంగా ఉందని అంటున్నారు.  బాల్టిక్‌ సముద్రంతోపాటు నాటో దేశాల సమీపంలోకి వచ్చే పౌర విమానాలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. గతంలో ఎన్నడూ నకిలీ జీపీఎస్‌ సిగ్నల్స్‌ ఇంతగా ఎదురుకాలేదని పరిశీలకులు అంటున్నారు.

We’re now on WhatsApp. Click to Join

విమానాల నావిగేషన్‌కు అవసరమైన జీపీఎస్‌ వ్యవస్థను నిలిపివేసే టెక్నాలజీ(GPS Jamming)  రష్యా వద్ద ఉందని స్వీడన్‌ ఆర్మీ అనుమానం వ్యక్తం చేస్తోంది.  నావిగేషన్‌ వ్యవస్థను ఏమార్చి విమానాలను తప్పుదోవ పట్టించేలా నకిలీ జీపీఎస్ సిగ్నల్స్ ఉన్నాయని అంటోంది. విమానాల నావిగేషన్‌ వ్యవస్థను ప్రభావితం చేసి, నకిలీ జీపీఎస్‌ ద్వారా విమానాలను దారి మళ్లించే ప్రక్రియను జీపీఎస్‌ సిగ్నల్‌ స్పూఫింగ్‌ అంటారు. నిజమైన శాటిలైట్‌ సిగ్నల్స్‌ను అడ్డుకొని ఆ స్థానంలో నకిలీ సంకేతాలను పంపి జీపీఎస్‌ రిసీవర్‌ను తప్పుదోవ పట్టించడమే ఈ  జీపీఎస్‌ సిగ్నల్‌ స్పూఫింగ్‌ టెక్నాలజీ ప్రత్యేకత.  వీటి ఎఫెక్టుతో ప్రయాణంలో ఉన్న విమానానికి ప్రస్తుతమున్న ప్రదేశం, సమయం తప్పుగా కనిపిస్తాయి. పౌర విమానాలే లక్ష్యంగా ఇలా జరుగుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. ఏదైనా విమానం తప్పుడు డైరెక్షన్‌లో ప్రయాణిస్తే.. పెను ప్రమాదం జరిగి ఎంతోమంది అమాయకుల ప్రాణాలు ముప్పులో పడతాయి. విమానాలు దారి తప్పిన ఘటనలు గతేడాది ఇరాన్‌-ఇరాక్‌ గగనతలంలో కూడా చోటుచేసుకున్నాయి.

Also Read :Mahindra University : హైదరాబాద్‌లోని మహీంద్రా వర్సిటీకి 500 కోట్లు : ఆనంద్‌ మహీంద్రా