China Warned America: అమెరికాకు చైనా వార్నింగ్..!

భారత్‌తో తమ సంబంధాల విషయంలో జోక్యం చేసుకోవద్దని అమెరికాను చైనా హెచ్చరించినట్టు పెంటగాన్ నివేదిక వెల్లడించింది.

భారత్‌తో తమ సంబంధాల విషయంలో జోక్యం చేసుకోవద్దని అమెరికాను చైనా హెచ్చరించినట్టు పెంటగాన్ నివేదిక వెల్లడించింది. వాస్తవాధీన రేఖ వెంబడి భారత్, చైనాల మధ్య కొనసాగుతున్న ప్రతిష్టంభన తీవ్రతను తగ్గించడానికి ప్రయత్నిస్తున్నామని PRC అధికారులు చెప్పారని నివేదిక తెలిపింది. సరిహద్దు స్థిరత్వాన్ని కాపాడటానికి భారత్, అమెరికాతో ద్వైపాక్షిక సంబంధాలకు విఘాతం కలగకుండా ప్రతిష్టంభనకు తెరదించాలనే ఉద్దేశాన్ని వారు నొక్కి చెప్పారని ఈ మేరకు మంగళవారం కాంగ్రెస్‌కు సమర్పించిన నివేదికలో పేర్కొంది.

‘‘PRC (పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా) భారత్‌తో సరిహద్దు ఉద్రిక్తతలను నిరోధించేందుకు అమెరికాతో మరింత సన్నిహితంగా భాగస్వామి కావడానికి ప్రయత్నిస్తోంది. భారత్‌తో చైనా సంబంధాలలో జోక్యం చేసుకోవద్దని పీఆర్‌సీ అధికారులు హెచ్చరించారు’’ అని తెలిపింది. భారత్ సరిహద్దులో 2021 అంతటా బలగాల మోహరింపు, వాస్తవాధీన రేఖ వెంట మౌలిక సదుపాయాల నిర్మాణాన్ని చైనా కొనసాగించిందని పేర్కొంది. సరిహద్దుల్లో తమ ప్రయోజనాల విషయంలో ఇరుపక్షాలు వెనక్కితగ్గకపోవడంతో చర్చలు ఆశించిస్థాయిలో పురోగతిని సాధించలేదని నివేదిక అభిప్రాయపడింది. మే 2020 నుంచి వాస్తవాధీన రేఖ వెంబడి అనేక ప్రాంతాల్లో భారత్, చైనాల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. దీంతో ఇరు దేశాలూ తమ బలగాలను భారీగా మోహరించాయి. సరిహద్దుల్లో ఉద్రిక్తతలను చర్చల ద్వారా పరిష్కరించుకునే ప్రక్రియలో భాగంగా 16 సార్లు కార్ప్స్ కమాండర్ స్థాయి చ‌ర్చ‌లు జరిగాయి.

‘‘ప్రతి దేశం మరొకరి బలగాలను ఉపసంహరించుకోవాలని, ప్రతిష్టంభనకు ముందు పరిస్థితులకు తిరిగి రావాలని డిమాండ్ చేసింది. అయితే చైనా లేదా భారత్ ఆ షరతులపై అంగీకరించలేదు’’ అని నివేదిక పేర్కొంది. ‘ప్రతిష్టంభన విషయంలో భారత్ మౌలిక సదుపాయాల నిర్మాణంపై ఆరోపణలు చేసిన చైనా తమ భూభాగాన్ని ఆక్రమించారని అయితే మా భూభాగంలోకి చైనా దూకుడుగా చొరబాట్లను ప్రారంభించిందని భారత్ ఆరోపించింది’’ అని పెంటగాన్ నివేదిక తెలిపింది. మే 2020లో తూర్పు లడఖ్‌ లోకి చైనా సైన్యం చొచ్చుకురావడంతో భారత్ ధీటుగానే స్పందించింది. దీంతో అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఎంతో ప్రశాంతంగా ఉండే గల్వాన్‌లో భారత్, చైనా సైనికులు ఘర్షణ పడ్డారు. ఘర్షణల తర్వాత అక్కడి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఉద్రిక్త వాతావరణ పరిస్థితుల నడుమ కొన్ని ప్రాంతాల్లోకి చైనా సైన్యం ప్రవేశించింది. రెండేళ్ల కింద భారత్ కొత్త మ్యాప్‌లో ఆక్సాయీ చిన్‌ను తమ ప్రాంతంగా చూపించడంపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ తర్వాత నుంచే సరిహద్దుల్లో చైనా దుందుడుకు వైఖరి ప్రదర్శిస్తోంది.