China Army In Pak : చైనా ఆర్మీ ఎక్కడైనా కాలు మోపితే.. మళ్లీ వెనక్కి కదలదు. అంతటి మొండి ఘటం ఇప్పుడు పాకిస్తాన్ భూభాగంలోకి ఎంటర్ కాబోతోందా ? ఉగ్రవాదంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాక్‌లోని బెలూచిస్తాన్ ప్రాంతంలో చైనా సేనలను మోహరిస్తారని తెలుస్తోంది. చైనా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘చైనా-పాక్ ఎకనామిక్ కారిడార్’ (సీపెక్) బెలూచిస్తాన్‌లోనే ఉంది. సీపెక్‌లో పనిచేస్తున్న వారిలో దాదాపు 30 వేల మంది చైనా జాతీయులే. గ్వాదర్ పోర్ట్ ప్రాంతంలోనూ చైనాకు కీలకమైన ప్రాజెక్టులు ఉన్నాయి. సీపెక్ ప్రాజెక్టుతో పాటు వాటిని సైతం బెలూచిస్తాన్ వేర్పాటువాద మిలిటెంట్ సంస్థలు లక్ష్యంగా చేసుకుంటున్నాయి. బెలూచిస్తాన్‌లో చైనా కంపెనీలకు కాంట్రాక్టులను కట్టబెట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఇటీవలే పాక్‌లో జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) ఉగ్రవాదులు హైజాక్ చేశారు. ఎంతోమందిని పొట్టన పెట్టుకున్నారు.
Also Read :What Is Autopen : ఏమిటీ ఆటోపెన్ ? బైడెన్ ఏం చేశారు ? నిప్పులు చెరిగిన ట్రంప్
సొంతంగా రక్షించుకునే అవకాశం కోసం..
ఈ పరిణామాలన్నీ నిశితంగా పరిశీలించిన చైనా(China Army In Pak).. పాక్ సర్కారు ఎదుట కీలక ప్రతిపాదన పెట్టిందట. సీపెక్, గ్వాదర్ పోర్ట్ సహా బెలూచిస్తాన్ పరిధిలోని తమకు చెందిన అన్ని ప్రాజెక్టులను సొంతంగా రక్షించుకునే అవకాశాన్ని కల్పించాలని పాక్ సర్కారును చైనా కోరిందట. అలా కుదరకుంటే.. కనీసం పాక్-చైనా సంయుక్త సెక్యూరిటీ కంపెనీ ఏర్పాటుకు అంగీకారం తెలపాలని పాక్‌కు చైనా రిక్వెస్ట్ చేసిందట. యాంటీ టెర్రరిజం కోఆపరేషన్ అగ్రిమెంట్‌పైనా సంతకం చేయాలని పాక్‌ను చైనా కోరుతోంది. ఒకవేళ ఇందుకు పాక్ సైన్యం తల ఊపితే.. చైనా ఆర్మీ బెలూచిస్తాన్ ప్రాంతంలో దిగేందుకు అధికారిక అనుమతులు మంజూరవుతాయి. అదే జరిగితే బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) పాక్ వ్యాప్తంగా మరింత తీవ్రమైన ఉగ్రదాడులకు పాల్పడే ముప్పు ఉంటుంది. ఈ రిస్క్‌ను పాకిస్తాన్ సైతం అంచనా వేయగలదు. అందుకే చైనా ప్రతిపాదనలపై వెంటనే పాక్ వైపు నుంచి ఎలాంటి స్పందనా రాలేదు.
Also Read :George Soros Vs ED : ‘జార్జ్ సోరోస్’ నుంచి లబ్ధిపొందిన సంస్థలపై ఈడీ రైడ్స్
ఇప్పటికే చైనా ప్రైవేటు భద్రతా టీమ్‌లు
సీపెక్ ప్రాజెక్టులో పనిచేస్తున్న ఇద్దరు చైనా జాతీయులపై గతేడాది బీఎల్ఏ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఆ ఘటనను తీవ్రంగా పరిగణించిన చైనా సర్కారు.. సీపెక్ ప్రాజెక్టులోని చైనీయులను కాపాడుకోవడానికి తమ దేశానికి చెందిన ప్రైవేటు భద్రతా బృందాలను నియమించడానికి పాక్ నుంచి అనుమతి పొందింది. ఇందులో భాగంగా ఇప్పటికే సీపెక్ ప్రాజెక్టులున్న ప్రాంతాల్లో చైనాకు చెందిన ప్రైవేటు భద్రతా టీమ్‌లు విధులు నిర్వర్తిస్తున్నాయి. చైనా అధికారిక ఆర్మీ మాత్రం ఇప్పటిదాకా చైనా భూభాగంలోకి అడుగుపెట్టలేదు.