China Vs Taiwan : చైనా, తైవాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి పెరిగాయి. సోమవారం రోజు తైవాన్ చుట్టూ విమానాలు, యుద్ధ నౌకలతో చైనా డ్రిల్స్ నిర్వహించింది. తమ దేశాన్ని ఆక్రమించే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని ఇటీవలే తైవాన్ జాతీయ దినోత్సవాల సందర్భంగా అధ్యక్షుడు లై చింగ్-టె కీలక ప్రకటన చేశారు. లై చింగ్-టె చేసిన వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకొని ప్రతిచర్యలకు దిగొద్దని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ కూడా చైనాకు వార్నింగ్ ఇచ్చారు. ఈనేపథ్యంలో చైనా ఇవాళ బలంగా స్పందించింది. ఈరోజు తైవాన్ చుట్టూ చైనా చేస్తున్న సైనిక డ్రిల్స్ చాలా పెద్ద స్థాయివి. గత రెండేళ్లలో తైవాన్ చుట్టూ చైనా ఈవిధంగా సైనిక విన్యాసాలు(China Vs Taiwan) చేయడం ఇది నాలుగోసారి.
Also Read :AP Liquor Shop Tenders : ఏపీలో నేడే మద్యం షాపుల లాటరీ.. అదృష్టం ఎవర్ని వరిస్తుందో..!!
లై చింగ్-టె దూకుడు..
తైవాన్ అధ్యక్షుడిగా లై చింగ్-టె బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి చాలా దూకుడుగా ముందుకు సాగుతున్నారు. పొరుగునే ఉన్న చైనాకు ఆగ్రహం తెప్పించేలా ఆయన వ్యాఖ్యలు ఉంటున్నాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అమెరికా అండను చూసుకునే లై చింగ్-టె ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారని చెబుతున్నారు.
డ్రిల్స్ ఇలా..
‘జాయింట్ స్వోర్డ్-2024B’ పేరుతో ఇవాళ చైనాసైనిక విన్యాసాలు చేస్తోంది. ఇందులో భాగంగా తైవాన్‌కు ఉత్తరాన ఉన్న సించు వైమానిక దళ స్థావరం సమీపంలో సోమవారం నాలుగు యుద్ధ విమానాలు చక్కర్లు కొట్టాయి. చైనా ఆర్మీకి చెందిన థియేటర్ కమాండ్ దళాల ఉమ్మడి కార్యకలాపాల సామర్థ్యాలను ఈ డ్రిల్స్‌లో పరీక్షించారు. తైవాన్ ద్వీపానికి ఉత్తరం, దక్షిణం, తూర్పు ప్రాంతాలలో ఈ డ్రిల్స్ చేస్తున్నట్లు స్వయంగా చైనా మిలిటరీ తూర్పు థియేటర్ కమాండ్ ప్రతినిధి కెప్టెన్ లి జి వెల్లడించారు. సముద్రంలో, గాలిలో తమ దళాల పోరాట సన్నద్ధతను, పెట్రోలింగ్ సన్నద్ధతను తెలుసుకునేందుకు ఈ డ్రిల్స్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. తాము తైవాన్ ద్వీపం చుట్టూ తనిఖీలు చేయడం సాధారణ విషయమేనన్నారు. ఇక దీనిపై తైవాన్ ఆర్మీ స్పందిస్తూ.. ‘‘మా దేశ ఉత్తర, నైరుతి, తూర్పు సముద్ర జలాల్లో చైనా తీర రక్షక నౌకల కాన్వాయ్‌లను చూశాం’’ అని వెల్లడించింది.