Covid Update: చైనాలో ఆంక్షలు సడలాయి.. ‘గ్రేట్‌ మైగ్రేషన్‌’ మొదలైంది..ఇక కరోనా కూడా సాధారణ వ్యాధే!!

కొత్త సంవత్సరం వేళ చైనాలో ‘గ్రేట్‌ మైగ్రేషన్‌’ జరుగుతోంది. కొవిడ్ ఆంక్షలు సడలించడంతో రానున్న 40 రోజుల పాటు చైనీయులు భారీగా ప్రయాణాలు చేయనున్నారు.

  • Written By:
  • Publish Date - January 8, 2023 / 08:15 PM IST

Great Migration: కొత్త సంవత్సరం వేళ చైనాలో ‘గ్రేట్‌ మైగ్రేషన్‌’ జరుగుతోంది. కొవిడ్ ఆంక్షలు సడలించడంతో రానున్న 40 రోజుల పాటు చైనీయులు భారీగా ప్రయాణాలు చేయనున్నారు. ఇది మరింత కరోనా (Corona) ఉద్ధృతికి దారితీసే అవకాశం ఉందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  ఇంతకాలం జీరో కొవిడ్ విధానం అనుసరించిన చైనా ఇటీవల వాటిని సడలించింది.  కరోనా కేసులు పెరుగుతోన్న తరుణంలో ఆంక్షలను ఆకస్మికంగా ఎత్తివేసింది. సరిగ్గా ఈ సమయంలోనే ఆ దేశం లూనార్‌ న్యూయర్  వేడుకలు(జనవరి 22) జరుపుకోనుంది. ఇందుకోసం ప్రజలు పెద్దఎత్తున ప్రయాణాలు చేయనున్నారు. సొంతూళ్లకు వెళ్లనున్నారు.

గ్రామాలకు కరోనా (Corona) ముప్పు..

లూనార్‌ న్యూయర్  వేడుకల కోసం రానున్న 40 రోజుల్లో కోట్లాది మంది రాకపోకలు సాగించనున్నారు. దాంతో ప్రయాణికుల సంఖ్య దాదాపు 200 కోట్లకు చేరుకుంటుందని చైనా రవాణా శాఖ అంచనా వేసింది.
అయితే ఈ అంచనాలపై ప్రజల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. మూడు సంవత్సరాల తర్వాత తొలిసారి ప్రయాణాలపై ఆంక్షలు లేకపోవడంతో కొందరు ఊపిరిపీల్చుకుంటున్నారు. తమ వారితో కొత్త సంవత్సరం వేడుకలు చేసుకోవచ్చని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి దృష్ట్యా తాము ఊరు వెళ్లమని మరికొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. నగరాల నుంచి ప్రజలు తమ సొంతూళ్లకు ప్రజలు భారీగా వెళ్తారన్న అంచనాల మధ్య.. గ్రామాలకు కూడా వైరస్ సోకుతుందని ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. గ్రామాల్లో వైద్య సదుపాయాల కొరత ఉంది. ఒకవేళ పల్లెల్లో కరోనా విజృంభిస్తే.. పరిస్థితులు మరింత క్లిష్టంగా మారే ముప్పు ఉంటుంది.

ఇక కరోనా (Corona) కూడా సాధారణ వ్యాధే..

ఇన్నాళ్లూ కరోనా విషయంలో కఠిన షరతులు, క్వారంటైన్ విధించిన చైనా.. నిన్నటితో వాటికి ముగింపు పలికింది. ఇక ఇవాళ్టి నుంచి ఆ దేశంలో కరోనా కూడా సాధారణ వ్యాధే. జ్వరం, జలుబు, దగ్గు ఇలాంటి వాటిని మనం సాధారణ ఇన్ఫెక్షన్లుగా భావిస్తాం కదా. ఇప్పుడు వీటి సరసన కరోనాను కూడా చేర్చింది చైనా. క్వారంటైన్ ఎత్తివేసింది. ఇవాళ్టి (ఆదివారం) నుంచి.. కరోనా కూడా సాధారణ వ్యాధే. అది సోకిన వాళ్లపై ఎలాంటి కఠిన ఆంక్షలూ లేవు.

గొంతు నులుముతున్నారు

కొవిడ్ విధానాలపై విమర్శలు చేసే వారి గొంతును చైనా ప్రభుత్వం నులుముతోంది. ఈక్రమంలోనే తాజాగా దాదాపు1000 మందికిపైగా విమర్శకుల సోషల్‌ మీడియా ఖాతాలను సస్పెండ్‌ చేసింది.