. యువత వెనుకడుగు..సామాజిక-ఆర్థిక కారణాలు
. ప్రభుత్వ ప్రోత్సాహకాలు, సబ్సిడీలు విఫలమయ్యాయని వెల్లడి
. పెరుగుతున్న వృద్ధుల జనాభాతో ఆర్థిక వ్యవస్థకు ముప్పు
China : చైనా ప్రస్తుతం తీవ్రమైన జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దేశంలో జననాల రేటు నిరంతరం పడిపోతుండటం ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. యువతను పెళ్లిళ్ల వైపు, పిల్లల్ని కనే దిశగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఎన్నో విధానాలు ప్రోత్సాహకాలు ప్రకటించినప్పటికీ ఆశించిన ఫలితాలు మాత్రం కనిపించడం లేదు. గత ఏడాది నమోదైన జననాల సంఖ్య చరిత్రలోనే అత్యల్ప స్థాయికి చేరుకోవడం ఈ సమస్య తీవ్రతను స్పష్టంగా చూపిస్తోంది. ఈ పరిణామాలు చైనా ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తుపై కూడా తీవ్రమైన ఆందోళనలను కలిగిస్తున్నాయి.
తాజా అధికారిక గణాంకాల ప్రకారం గత ఏడాది చైనాలో కేవలం 7.92 మిలియన్ల జననాలు మాత్రమే నమోదయ్యాయి. ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే దాదాపు 17 శాతం తగ్గుదల. 1949 తర్వాత ఇంత తక్కువ సంఖ్యలో జననాలు నమోదవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇదే సమయంలో మరణాల సంఖ్య 11.31 మిలియన్లకు చేరడంతో దేశ మొత్తం జనాభా 3.39 మిలియన్లు తగ్గి 1.4049 బిలియన్లకు పరిమితమైంది. ఈ గణాంకాలు చూస్తే కుటుంబ నియంత్రణ విధానాల సడలింపులు పిల్లల సంరక్షణకు ఇచ్చే సబ్సిడీలు ఆశించిన స్థాయిలో పనిచేయలేదని స్పష్టమవుతోంది. ఒకప్పుడు జనాభా పెరుగుదలను నియంత్రించేందుకు అమలు చేసిన కఠిన విధానాల ప్రభావం ఇప్పుడు విరుద్ధ ఫలితాలుగా మారిందని విశ్లేషకులు అంటున్నారు.
జనాభా తగ్గుదలకు ప్రధాన కారణాలు కేవలం విధానపరమైనవే కాకుండా సామాజిక, ఆర్థిక అంశాలుగా ఉన్నాయి. యువత పెళ్లిళ్లు ఆలస్యంగా చేసుకోవడం లేదా పూర్తిగా మానేయడం, అధిక జీవన వ్యయం, ఖరీదైన గృహ వసతి, ఉద్యోగాల్లో తీవ్రమైన పోటీ వంటి అంశాలు పిల్లల్ని కనాలనే ఆలోచనను వెనక్కి నెట్టుతున్నాయి. అదే సమయంలో దశాబ్దాలుగా అమలైన ఒకే సంతానం విధానం వల్ల ఏర్పడిన జనాభా అసమతుల్యత కూడా ఈ సంక్షోభానికి కారణమవుతోంది. పని చేసే వయసు జనాభా తగ్గుతూ వృద్ధుల సంఖ్య పెరుగుతుండటంతో ఉత్పాదకత తగ్గే ప్రమాదం ఉంది. దీర్ఘకాలంలో ఇది పింఛను వ్యవస్థపై భారంగా మారడమే కాకుండా దేశీయ వినియోగ మార్కెట్‌ను కూడా బలహీనపరుస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు చైనా ప్రభుత్వం గత ఏడాది పలు ప్రోత్సాహక చర్యలను ప్రకటించింది.
మూడేళ్లలోపు పిల్లలకు 10,800 యువాన్ల వరకు సబ్సిడీ, ప్రసవానికి సంబంధించిన ఖర్చులపై బీమా విస్తరణ, వివాహ నమోదును సులభతరం చేయడం, విడాకుల ప్రక్రియను కఠినతరం చేయడం వంటి చర్యలు వాటిలో ఉన్నాయి. ఈ విధానాల వల్ల వివాహాల సంఖ్యలో స్వల్ప పెరుగుదల కనిపించింది. 2025 తొలి మూడు త్రైమాసికాల్లో వివాహ రిజిస్ట్రేషన్లు సుమారు 8.5 శాతం పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే వివాహాల సంఖ్య పెరగడం మాత్రమే జనాభా సమస్యకు పరిష్కారం కాదని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. సంతానోత్పత్తి వయసులో ఉన్న మహిళల సంఖ్య తగ్గడం పిల్లల్ని కనాలనే ఆసక్తి లేకపోవడం వంటి అంశాలు ఇంకా పెద్ద సవాళ్లుగానే ఉన్నాయి. అందువల్ల అందుబాటు ధరల్లో గృహ వసతి, పని-జీవిత సమతుల్యత, లింగ సమానత్వం, నమ్మదగిన శిశు సంరక్షణ వ్యవస్థ వంటి సమగ్ర మద్దతు కల్పిస్తేనే ఈ జనాభా క్షీణతను అడ్డుకోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
