China Vs Israel : లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. డ్రోన్లు, మిస్సైళ్లు, యుద్ధ విమానాలతో విరుచుకు పడుతోంది. ఈ దాడుల్లో 492 మందికిపైగా లెబనాన్ ప్రజలు చనిపోయారు. ఈ పరిణామాలపై చైనా(China Vs Israel) కీలక ప్రకటన విడుదల చేసింది. లెబనాన్‌కు తమ మద్దతు ఉంటుందని వెల్లడించింది. దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుకునేందుకు లెబనాన్‌కు తమవంతు సాయాన్ని అందిస్తామని ప్రకటించింది. లెబనాన్ భద్రత కోసం తప్పకుండా మద్దతు ఇస్తామని చైనా తెలిపింది. ఈనెల 23న (సోమవారం) అమెరికాలోని న్యూయార్క్‌లో తాను ఈ అంశంపై లెబనాన్ విదేశాంగ మంత్రి అబ్దల్లా బౌ హబీబ్‌తో చర్చించానని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ వెల్లడించారు. లెబనాన్ భూభాగంపై ఇజ్రాయెల్ సైన్యం దాడులను ఆయన ఖండించారు. లెబనాన్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై పూర్తి సమాచారాన్ని చైనా ఎప్పటికప్పుడు సేకరిస్తూనే ఉందని చెప్పారు.
Also Read :Govt Employees Assets : ఈనెల 30లోగా ఆస్తుల వివరాలివ్వకుంటే ఇక శాలరీ రాదు
‘‘చైనా న్యాయం పక్షానే నిలబడుతుంది. లెబనాన్ సహా అరబ్ సోదరులకు మా మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది’’ అని వాంగ్ యీ వెల్లడించారు. లెబనాన్- ఇజ్రాయెల్ ఘర్షణలు ప్రాంతీయ స్థాయి యుద్ధంగా మారకుండా నిరోధించేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఇటీవలే లెబనాన్‌లో పేజర్లు, వాకీటాకీలు పేలిన ఘటనలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం తనను కలచి వేసిందని వాంగ్ యీ తెలిపారు. మిడిల్ ఈస్ట్ దేశాల్లో శాంతి నెలకొనాలని చైనా ఆకాంక్షిస్తోందన్నారు. అరబ్ దేశాలు, అంతర్జాతీయ సమాజంతో కలిసి పని చేస్తూనే ఉంటామని స్పష్టం చేసింది. ఇజ్రాయెల్- హమాస్, ఇజ్రాయెల్- లెబనాన్ మధ్య కాల్పుల విరమణను తాము కోరుకుంటున్నట్లు వాంగ్ యీ తెలిపారు. ఇజ్రాయెల్, పాలస్తీనాలను రెండు వేర్వేరు దేశాలుగా నిర్దిష్టంగా విభజిస్తేనే మిడిల్ ఈస్ట్‌లో శాంతి సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ దిశగా తమ ప్రయత్నాలు రానున్న కాలంలోనూ కొనసాగుతాయన్నారు. ప్రపంచ శాంతికి దోహదపడాలనేది చైనా లక్ష్యమన్నారు.