Biden – Car Crash : అమెరికా ప్రెసిడెంట్ కాన్వాయ్‌లో కలకలం.. ఏమైందంటే ?

Biden - Car Crash : ఓ గుర్తు తెలియని ప్రైవేటు కారు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్​ కాన్వాయ్‌​కు చెందిన సెక్యూరిటీ వాహనాన్ని ఆదివారం రాత్రి ఢీకొట్టింది.

  • Written By:
  • Updated On - December 18, 2023 / 01:11 PM IST

Biden – Car Crash : ఓ గుర్తు తెలియని ప్రైవేటు కారు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్​ కాన్వాయ్‌​కు చెందిన సెక్యూరిటీ వాహనాన్ని ఆదివారం రాత్రి ఢీకొట్టింది. డెలావర్ రాష్ట్రంలోని విల్మింగ్టన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.. బైడెన్,​ ఆయన భార్య జిల్​ బైడెన్​ను వెంటనే అక్కడి నుంచి వైట్‌హౌస్‌కు తరలించారు. వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదని ప్రకటించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీ చేసేందుకు బైడెన్ విస్తృత సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈక్రమంలోనే డెలావర్‌లోని విల్మింగ్టన్‌లో తన ప్రచార కమిటీ సభ్యులతో బైడెన్ ఆదివారం రాత్రి సమావేశమయ్యారు. అధ్యక్ష ప్రచార కమిటీ సభ్యులతో బైడెన్ దంపతులు విందు చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

అనంతరం బైడెన్ దంపతులు తిరిగి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా కాన్వాయ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. ఒక ప్రైవేటు కారు.. అధ్యక్షుడి కాన్వాయ్‌లో పార్క్​ చేసి ఉన్న సీక్రెట్ సర్వీస్​ అధికారుల కారును ఢీకొట్టింది. ఆ తర్వాత కూడా కాన్వాయ్‌లోని మరో వాహనంపైకి దూసుకెళ్లేందుకు ప్రైవేటు కారు డ్రైవర్ విఫల యత్నం చేశాడు. దీంతో అమెరికా సీక్రెట్ సర్వీస్ అధికారులు ఆయుధాలతో ఆ కారును చుట్టుముట్టారు. సరిగ్గా ఇదే సమయంలో  బైడెన్ దంపతులు కాన్వాయ్‌లోని తమ వాహనంలో కూర్చునేందుకు వెళుతున్నారు. ఆ సీన్‌ను బైడెన్ దంపతులు దూరం నుంచే చూశారు. అమెరికా అధ్యక్షుడి వాహనానికి 130 అడుగుల దూరంలోనే ఈ ఘటన జరగడం గమనార్హం. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు(Biden – Car Crash) చేస్తున్నారు.