. ఈ నెల 31 రాత్రి 11.59 గంటలకు కొత్త స్టార్ట్-అప్ వీసా దరఖాస్తులు పూర్తిగా నిలిపివేత
. దాని స్థానంలో తమ దేశంలో వ్యాపారాలు ప్రారంభించే విదేశీయుల కోసం కొత్త పథకం
. ఈ మేరకు 2026లో పైలట్ ప్రాజెక్టు ద్వారా శాశ్వత నివాసానికి కొత్త స్కీమ్ అంటూ ఐఆర్‌సీసీ ప్రకటన
Canada Immigration: కెనడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు విదేశీ ఉదయమకారులకు అవకాశాలు కల్పించిన స్టార్టప్ వీసా (SUV – Start-up Visa) ప్రోగ్రామ్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ప్రోగ్రామ్ కింద వర్క్ పర్మిట్‌కు దరఖాస్తు చేసే కొత్త అభ్యర్థుల నుంచి ఇకపై అప్లికేషన్లు స్వీకరించబోమని ఇమిగ్రేషన్, రెఫ్యూజీస్ అండ్ సిటిజన్‌షిప్ కెనడా (IRCC) స్పష్టం చేసింది. కెనడాలోని వ్యాపార ఇమిగ్రేషన్ విధానాలను పునర్నిర్మించే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. స్టార్టప్ వీసా ద్వారా ఇన్నోవేటివ్ ఐడియాలతో వ్యాపారాలు ప్రారంభించాలనుకునే విదేశీయులకు కెనడా ఇప్పటివరకు తలుపులు తెరిచి ఉంచింది. అయితే తాజా పరిస్థితులు, దీర్ఘకాలిక ఇమిగ్రేషన్ లక్ష్యాల నేపథ్యంలో ఈ ప్రోగ్రామ్‌ను సమీక్షించాల్సిన అవసరం ఏర్పడినట్లు తెలుస్తోంది.
Canada
స్టార్టప్ వీసా ప్రోగ్రామ్‌ను నిలిపివేసినప్పటికీ, ఇప్పటికే ఈ స్కీమ్ కింద వర్క్ పర్మిట్ పొందిన వారికి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది కెనడా ప్రభుత్వం. ప్రస్తుతం వర్క్ పర్మిట్‌తో ఉన్నవారు దానిని పొడిగించుకోవడానికి దరఖాస్తు చేస్తే, వాటిని కొనసాగిస్తామని ఐఆర్‌సీసీ వెల్లడించింది. అంటే కొత్తగా అప్లై చేసేవారికి మాత్రమే ఆంక్షలు ఉంటాయి కానీ, ఇప్పటికే కెనడాలో వ్యాపారాలు నిర్వహిస్తున్న స్టార్టప్ వ్యవస్థాపకులకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నమాట. ఇది పెట్టుబడిదారుల్లో, వ్యాపార వర్గాల్లో నమ్మకాన్ని నిలబెట్టే ప్రయత్నంగా విశ్లేషకులు భావిస్తున్నారు. స్టార్టప్ వీసా ద్వారా వచ్చిన వ్యాపారాలు కెనడా ఆర్థిక వ్యవస్థకు ఇప్పటికే కొంతమేర మేలు చేశాయని, వాటిని అకస్మాత్తుగా నిలిపివేయడం సరికాదనే ఆలోచనతో ఈ మినహాయింపు ఇచ్చినట్లు సమాచారం.
స్టార్టప్ వీసా ప్రోగ్రామ్‌కు బదులుగా పూర్తిగా కొత్త వ్యాపార ఇమిగ్రేషన్ స్కీమ్‌ను తీసుకురావాలని కెనడా ప్రభుత్వం యోచిస్తోంది. ఈ కొత్త ప్రోగ్రామ్‌ను 2026లో పైలట్ ప్రాజెక్ట్ రూపంలో ప్రారంభించే అవకాశం ఉందని ఐఆర్‌సీసీ అధికారులు తెలిపారు. ఇది కెనడా దీర్ఘకాలిక ఇమిగ్రేషన్ లక్ష్యాలకు అనుగుణంగా ఉండేలా రూపకల్పన చేస్తున్నట్లు వెల్లడించారు. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించే విదేశీయులకు మరిన్ని సౌకర్యాలు, స్పష్టమైన మార్గదర్శకాలు కల్పించడమే లక్ష్యంగా ఈ స్కీమ్ ఉండొచ్చని అంచనా. అయితే స్టార్టప్ వీసా, రాబోయే కొత్త ప్రోగ్రామ్ మధ్య తేడాలు ఏంటన్న విషయాన్ని అధికారులు ఇంకా వెల్లడించలేదు. అన్ని వివరాలను 2026లో అధికారికంగా ప్రకటిస్తామని మాత్రమే స్పష్టం చేశారు. మొత్తంగా చూస్తే, కెనడా తన వ్యాపార ఇమిగ్రేషన్ విధానాన్ని మరింత సమర్థవంతంగా మార్చుకునే దిశగా అడుగులు వేస్తోంది. స్టార్టప్ వీసా ముగింపు ఒక అధ్యాయం అయితే, కొత్త స్కీమ్‌తో మరో అధ్యాయం ప్రారంభం కానుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
