Site icon HashtagU Telugu

India – Canada Clash : కెనడా – ఇండియా ఘర్షణ.. అమెరికా సీరియస్

Canada India Clash..america Is Serious

Canada India Clash..america Is Serious

By: డా. ప్రసాదమూర్తి

India – Canada Clash : కెనడియన్ సిక్కు యాక్టివిస్ట్ హర్ దీప్ సింగ్ నిజ్జార్ హత్యపై భారత ప్రభుత్వం మీద కెనడా మోపిన ఆరోపణల సెగ రగిలి రగలి జ్వాలలా మారుతోంది. ఇలాంటి వ్యవహారంలో ఒక దేశానికి ప్రత్యేక మినహాయింపులు ఉండవని ఈ రోజు అమెరికా పరోక్షంగా భారత్ (India) ని హెచ్చరించింది. కెనడాలో మరొక సిక్కు వేర్పాటు వాది బుధవారం హత్యకు గురైనట్టు వచ్చిన వార్త ఇప్పటికే పరిస్థితిని మరింత తీవ్రతరం చేసింది. అమెరికన్ జాతీయ భద్రతా సలహాదారు జేక్ సూలీవాన్ గురువారం వాషింగ్టన్ లో మీడియాతో మాట్లాడుతూ భారత్ పై కెనడా ప్రభుత్వం (Canada Government) చేసిన ఆరోపణ చాలా తీవ్రమైందని, ఆందోళన కలిగించేదిగా ఉందనీ అన్నారు. ఈ వ్యాఖ్య కెనడా, భారత్ (India) మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణానికి మరింత ఆజ్యం పోసినట్టయింది.

ఆ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఈ పరిణామాలను తాము చాలా సీరియస్ గా తీసుకుంటున్నామని, దీని మీద తాము చేయాల్సిందంతా చేస్తామని, ఇందుకు ఏ దేశానికీ ఎలాంటి మినహాయింపులు లేవని ఆయన అన్నారు. దేశాలతో సంబంధం లేకుండా తమ మౌలిక సూత్రాలను కాపాడుకోవడంలో తమను తాము రక్షించుకోవడంలో తాము ఖచ్చితమైన వైఖరితో ఉంటామని, ఈ విషయంలో కెనడాతో సహా తమ మిత్ర దేశాలతో సంప్రదింపులు జరుపుతామని అన్నారు. సోమవారం కెనడా పార్లమెంటులో ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో భారత్ కి వ్యతిరేకంగా ఘాటు విమర్శలు చేసిన తర్వాత ఈ విషయంపై అమెరికా ఇంత తీవ్రంగా స్పందించడం ఇదే ప్రథమం.

కెనడా (Canada) పౌరుడైన హర్ దీప్ సింగ్ ని భారత గూఢచారి సంస్థ ఏజెంట్లు హత్య చేశారని, ఈ విషయంలో పూర్తి ఆధారాలతో తమ అధికారులు దర్యాప్తు సాగిస్తున్నారని కెనడా ప్రధాని అంటున్నారు. ఈ ఆరోపణలను నిరాధారమైనవిగా, దురుద్దేశపూరితమైనవిగా భారత్ (India) కొట్టి పారేసింది. అంతే కాదు, ఇరు దేశాలూ తమ తమ దౌత్యవేత్తలను బహిహ్కరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు అమెరికా ఇంత తీవ్రమైన పదజాలంతో భారత్ పై పరోక్షంగా విరుచుకుపడడంతో జరుగుతున్న విషయాలు ఎంత ప్రమాదకరంగా ఉన్నాయో అర్థమవుతోంది.

Also Read:  Minister Gangula: వినాయక మండపాలకు మంత్రి గంగుల 4 లక్షలు అందజేత

అమెరికాతో పాటు ఆస్ట్రేలియా, బ్రిటన్ కూడా భారత్ కు హెచ్చరికలాంటి సలహాలను ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ మూడు దేశాలూ ఇప్పటికే ఈ పరిణామాల పట్ల ఆందోళన వ్యక్తం చేశాయి. ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ ఈ విషయంలో తమ దేశపు ఆందోళన భారత్ కు తెలియజేసినట్టు చెప్పారు. అంతే కాదు, కెనడా సాగిస్తున్న దర్యాప్తుకు సహకరించమని ఆస్ట్రేలియా, అమెరికా భారత్ (India) కు నచ్చజెప్పినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో భారత్ వైఖరిని ఖండిస్తూ ఒక సంయుక్త ప్రకటన చేయాలని కెనడా (Canada) తన మిత్ర దేశాలను కోరినట్టు కూడా వాషింగ్టన్ పోస్ట్ లో వచ్చిన ఒక వార్తా కథనం ద్వారా అర్థమవుతోంది. కెనడా, ఇండియా మీడియాలో ఈ కథనం ఇప్పుడు వైరల్ అయినట్లు తెలుస్తోంది. అయితే ఈ కథనాన్ని అమెరికా అధికార వర్గాలు కొన్ని ఖండిస్తున్నట్టు కూడా వార్తలు వచ్చాయి.

ఏది ఏమైనా, ఇటీవల జరిగిన జి20 దేశాల శిఖరాగ్ర సమావేశంలో ఆడంబరంగా పాల్గొన్న అగ్రదేశాల నేతలు ఇంత హఠాత్తుగా ఇండియాను అంతర్జాతీయ కోర్టులో బొనెక్కించడానికి ఎందుకు చూస్తున్నాయా అన్న సందేహాలు మాత్రం తలెత్తక మానవు. మరో వైపు చైనాకు పోటీగా భారత్ తో సన్నిహిత సంబంధాలు నెరపడానికి ఎంతో ఉత్సాహం చూపిస్తున్న పశ్చిమ దేశాలు ఇప్పుడీ విషయంలో భారత్ పట్ల ఎలాంటి వైఖరి తీసుకుంటాయా అన్నదే సర్వత్రా నెలకొన్న ఉత్కంఠ. పశ్చిమ దేశాలతో మన బంధం మాటెలా ఉన్నా, ఖలిస్తాన్ ఉద్యమం విదేశీ గడ్డ మీద ఇంకా జీవంతో ఉందన్న వార్తలే చాలా కలవరపాటుకు గురిచేస్తున్నాయి. చూడాలి, భారత్ ఈ విషయాన్ని ఎంత నేర్పుగా, ఓర్పుగా, రాజకీయ చతురతతో పరిష్కరించుకుంటుందో.

Also Read:  Chandrababu – CID Custody : రెండు రోజుల సీఐడీ కస్టడీకి చంద్రబాబు.. ఏసీబీ కోర్టు సంచలన ఆదేశాలు

Exit mobile version