California Poor : అమెరికాలో పేదరికం.. గుహల్లో పేద కుటుంబాలు

California Poor : అమెరికాలో అందరూ ధనికులే ఉంటారని మనం భావిస్తుంటాం.

  • Written By:
  • Updated On - January 26, 2024 / 08:38 AM IST

California Poor : అమెరికాలో అందరూ ధనికులే ఉంటారని మనం భావిస్తుంటాం. వాస్తవానికి అమెరికాలోని 50 రాష్ట్రాలలోనూ పేదలు ఉన్నారు. ప్రత్యేకించి కాలిఫోర్నియా రాష్ట్రంలో ఇళ్లు లేని నిరుపేదల సంఖ్య చాలా ఎక్కువ. ఇంటి అద్దెలను కట్టలేని స్థితిలో ఉన్న ఎన్నో కుటుంబాలు గుహల్లో కూడా నివసిస్తున్నాయి.  మోడెస్టో నగరం సమీపంలోని  టుయోలమ్నే నది వెంట ఉన్న గుహల్లో ప్రజలు నివసిస్తున్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. నివసించేందుకుగానూ  ఒక్కో గుహను  దాదాపు 20 అడుగుల లోతు వరకు తవ్వుకున్నారట. . తాత్కాలిక మెట్ల ద్వారా గుహలోకి రాకపోకలు సాగించేవారట. ఈ గుహలోనే ఫర్నీచర్, ఇంటి సామాన్లు పెట్టుకొని చాలా కుటుంబాలు జీవించేవి. అయితే వారం క్రితమే పోలీసులకు ఈవిషయం తెలిసింది. దీంతో అక్కడికి వెళ్లి గుహల్లో నివసిస్తున్న కుటుంబాలను అక్కడి నుంచి ఖాళీ చేయించారు. పక్కనే నది ఉండటంతో గుహలకు వరద ముప్పు ఉంటుందని చెప్పి ఖాళీ చేయించారు.  ఇళ్లు లేని ఆ కుటుంబాలను(California Poor) తాత్కాలిక షెల్టర్ హోంలకు తరలించారు.

We’re now on WhatsApp. Click to Join.

వామ్మో అద్దెలు..

అత్యంత ధనిక కాలిఫోర్నియా రాష్ట్రంలో పేదల జీవితాలు దుర్భరంగా మారాయి. ప్రస్తుతం అక్కడ తక్కువ అద్దెలో ఇళ్లు దొరకడం లేదు. దీంతో ఎన్నో పేద కుటుంబాలు రోడ్ల పక్కన టెంట్లు వేసుకొని జీవిస్తున్నాయి.  కాలిఫోర్నియా రాష్ట్ర ప్రభుత్వం పేదరిక నిర్మూలన కోసం గత నాలుగు సంవత్సరాలలో లక్ష కోట్ల రూపాయలను ఖర్చు చేసింది.  అయినా 2018 నుంచి 2022 మధ్యకాలంలో రాష్ట్రంలో ఇళ్లు లేని పేదల సంఖ్య మరింత పెరిగింది.

Also Read :Nitish With Modi: నితీష్ జంప్.. మళ్లీ ఎన్డీఏ గూటికి.. 4న ప్రధాని మోడీతో సభ

అత్యంత వెనుకబడిన పట్టణం

అమెరికాలో ఆర్థికంగా అత్యంత వెనుకబడిన పట్టణం టెక్సాస్ రాష్ట్రంలో ఉన్న ఇస్కోబారెస్. అమెరికా- మెక్సికో దేశాల సరిహద్దుకు ఆనుకుని ఉన్న ఈ పట్టణంలో ఉపాధి అవకాశాలు లేక తాము ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఉందని స్థానికులు చెబుతున్నారు. అమెరికా జనాభా లెక్కల ప్రకారం, ఈ ఇస్కోబారెస్ పట్టణ జనాభాలో 62 శాతం మంది ప్రజలు దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నారు.అమెరికాలోని 1,000కి పైగా జనాభా ఉన్న పట్టణాల్లో పేదరికం అధికంగా ఉన్నది ఇక్కడేనని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇక్కడ పేదరికానికి ప్రధాన కారణం ఉపాధి అవకాశాలు లేకపోవడమే.  “ఇక్కడ భవిష్యత్తు పెద్దగా లేదు. ఉపాధి లేక మేము వెనుకబడిపోతున్నాం” అని ఓ యువతి చెప్పారు. “నేను చెత్త సేకరిస్తాను. అది తక్కువ స్థాయి పనే అయినా చేసేందుకు సిగ్గుపడను. చేయక తప్పదు. మంచి ఉద్యోగం దొరకాలంటే ఇక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందే” అని ఓ యువకుడు వివరించారు. ఈ పట్టణంలో 98 శాతం మంది స్పానిష్ మాట్లాడతారు.