Site icon HashtagU Telugu

British Airways : గాల్లో చక్కర్లు కొట్టిన బ్రిటిష్ ఎయిర్‌వేస్‌ విమానం.. సాంకేతిక లోపంతో చెన్నై నుంచి లండన్‌ కు

British Airways

British Airways

British Airways : అహ్మదాబాద్‌లో ఎయిరిండియా బోయింగ్ విమాన ప్రమాదం జరిగిన అనంతరం విమానయాన సంస్థలు మరింత అప్రమత్తంగా మారాయి. ప్రయాణికుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ, ఎలాంటి చిన్న లోపాన్ని కూడా అపహాస్యం చేయకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. అయినా అయినా, వరుసగా రెండు సాంకేతిక లోపాల ఘటనలు మరోసారి విమానయానం భద్రతపై ప్రశ్నలు రేపుతున్నాయి.

తాజాగా బ్రిటిష్ ఎయిర్‌వేస్ BA35 ఫ్లైట్‌ లండన్ హీత్రూ నుంచి చెన్నైకు బయలుదేరింది. అయితే, విమానం చెన్నైకి చేరుకునే సమయానికి సాంకేతిక లోపం తలెత్తింది. పైలట్ అప్రమత్తంగా వ్యవహరిస్తూ విమానాన్ని చెన్నై పరిసరాల్లో చక్కర్లు కొట్టిన అనంతరం భద్రతా పరంగా తిరిగి లండన్‌కి మళ్లించాడు. చివరికి హీత్రూ విమానాశ్రయానికి సురక్షితంగా ల్యాండింగ్ అయింది. అందులోని ప్రయాణికులు, సిబ్బంది అంతా క్షేమంగా కిందికి దిగడంతో కొంత ఊపిరి పీల్చుకున్నారు.

విమాన సంస్థ అధికారికంగా విడుదల చేసిన ప్రకటనలో ప్రయాణికుల భద్రతే తమకు అత్యంత ప్రాధాన్యమని స్పష్టం చేసింది. అయితే, ఈ సాంకేతిక లోపానికి సంబంధించి పూర్తి వివరాలను వెల్లడించలేదు. విమానం లండన్ నుంచి ఆదివారం మధ్యాహ్నం 12:40కి బయల్దేరాల్సి ఉండగా, 1:16కి ఆలస్యంగా బయలుదేరింది. తెల్లవారుజామున 3:30కి చెన్నై చేరుకోవాల్సి ఉండగా, లోపం కారణంగా ప్రయాణాన్ని మధ్యలో నిలిపేశారు.

ఇంకొక ఘటనలో, ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న లుఫ్తాంసా బోయింగ్ 787-9 డ్రీమ్‌లైనర్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో విమానాన్ని తిరిగి ఫ్రాంక్‌ఫర్ట్‌కి మళ్లించారు. సమాచారం ప్రకారం, బాంబు బెదిరింపు ముప్పు కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. విమానం మధ్యాహ్నం 13:05కి బయలుదేరాల్సి ఉండగా, ఆలస్యంగా 14:29కి బయలుదేరింది. తెల్లవారుజామున 1:20కి హైదరాబాద్ చేరుకోవాల్సి ఉండేది.

జూన్ 12న అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన ఎయిరిండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ కొద్ది క్షణాల్లోనే కూలిపోయింది. మెడికోలో ఉన్న హాస్టల్ భవనంపై విమానం కుప్పకూలడంతో భారీగా మంటలు చెలరేగాయి. విమానంలో 1,25,000 లీటర్ల ఇంధనం ఉండటంతో ప్రమాద తీవ్రత మరింత ఎక్కువైంది. ప్రమాదంలో 230 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, 12 మంది సిబ్బందిలో ఒక్కరు మినహా మిగతా అందరూ ప్రాణాలు కోల్పోయారు. అలాగే హాస్టల్‌లో ఉన్న 35 మంది విద్యార్థులు కూడా మరణించారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల్లో మరిన్ని ప్రాణనష్టాలు సంభవించనున్నాయన్న ఆందోళన ఉంది.

Tomato-Uji: టమోటా రైతులు కష్టంపై ఊజీ ఈగ దెబ్బ