Brazil Vs X : అపర కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన ఎక్స్ కంపెనీకి బ్రెజిల్‌లో భారీ ఊరట లభించింది. గత నెలలోనే బ్రెజిల్‌లో తమ కార్యకలాపాలను ఆపేసిన ఎక్స్ తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఆ దేశ సుప్రీంకోర్టు ఆదేశించిన విధంగా రూ.41 కోట్ల జరిమానా కట్టేందుకు రెడీ అని ఎక్స్ వెల్లడించింది. దీంతో తమ దేశంలో ఎక్స్ కార్యకలాపాలను ఆపేయాలంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలను వెనక్కి తీసుకుంటున్నట్లు బ్రెజిల్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి అలెగ్జాండర్ డీ మోరేస్ తీర్పు ఇచ్చారు. దీంతో బ్రెజిల్‌లో మళ్లీ కార్యకలాపాలను మొదలుపెట్టేందుకు ఎక్స్‌కు(Brazil Vs X) లైన్ క్లియర్ అయింది. దీంతో ఈ ఏడాది ఆగస్టు 31 నుంచి బ్రెజిల్‌లో ఎక్స్ ఎదుర్కొంటున్న న్యాయపరమైన ప్రతిష్టంభనకు తెరపడింది.
Also Read :Jimmy Carter 100 : అలనాటి అమెరికా అధ్యక్షుడి వందేళ్ల బర్త్ డే.. జిమ్మీ కార్టర్ సెంచరీ
తాజాగా బ్రెజిల్ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఎక్స్ కార్యకలాపాల నిర్వహణకు మార్గం సుగమమైంది. ఎక్స్ కంపెనీ బ్యాంకు ఖాతాలను అన్ బ్లాక్ చేయాలని బ్రెజిల్ సెంట్రల్ బ్యాంకుకు సుప్రీంకోర్టు నిర్దేశించింది. ఇక నుంచి అన్ని రకాల పేమెంట్స్‌ను ఎక్స్ స్వీకరించవచ్చని తెలిపింది. అయితే మొట్టమొదట తనపై ఉన్న రూ.41 కోట్ల జరిమానాలను బ్రెజిల్ ప్రభుత్వానికి చెల్లించాలని ఎక్స్‌కు సుప్రీంకోర్టు సూచించింది. ఇందుకు ఎక్స్ కంపెనీ తరఫు న్యాయవాది అంగీకరించారు. బ్రెజిల్‌లో ఎక్స్‌కు 2.20 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. గతంలో బ్రెజిల్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి అలెగ్జాండర్ డీ మోరేస్‌పై ఎక్స్ కంపెనీ యజమాని ఎలాన్ మస్క్ తీవ్ర విమర్శలు చేశారు. ‘‘ఆ జడ్జి దుష్టుడు, నియంత. హ్యారీ పోటర్ సిరీస్‌లోని విలన్ వోల్ డెమోర్ట్‌లా ఆయన వ్యవహరిస్తున్నారు’’ అని అప్పట్లో మస్క్ తిట్ల దండకం చదివారు. ఎట్టకేలకు బ్రెజిల్ న్యాయవ్యవస్థ ముందు ఎక్స్ తలవంచాల్సి వచ్చింది. కోర్టు తీర్పును అమలు చేసేందుకు ఎక్స్ సమ్మతించాల్సి వచ్చింది.