Site icon HashtagU Telugu

Boeing Starliner Returns : సునితా విలియమ్స్ లేకుండానే భూమికి చేరిన స్టార్ లైనర్.. ఎందుకు ?

Boeing Starliner Space Station

Boeing Starliner Returns : బోయింగ్ కంపెనీకి చెందిన తొలి స్పేస్ క్రాఫ్ట్  ‘స్టార్ లైనర్’‌ను జూన్ 5న అంతరిక్షంలోకి పంపారు. అందులో భారత సంతతి వ్యోమగామి సునితా విలియమ్స్, అమెరికా  వ్యోమగామి విల్మోర్‌లు స్పేస్‌లోకి వెళ్లారు. 10 రోజుల్లోనే వారు ఆ స్పేస్ క్రాఫ్ట్‌లో భూమికి తిరిగి రావాలని ప్లాన్ చేశారు. కానీ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్‌లో సాంకేతిక లోపాలు తలెత్తడంతో తిరుగు ప్రయాణం వాయిదాపడింది. ప్రస్తుతం  వ్యోమగాములు సునితా విలియమ్స్, విల్మోర్‌లు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)‌లో ఉన్నారు. ఈనేపథ్యంలో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. వ్యోమగాములు లేకుండానే బోయింగ్ స్టార్ లైనర్(Boeing Starliner) అంతరిక్షం నుంచి భూమికి చేరుకుంది. ఈవిషయాన్ని నాసా వెల్లడించింది.

Also Read :Ganapati Bappa: నేడు గణపతి బప్పాకు ఈ వస్తువులు సమర్పించండి..!

సాంకేతిక లోపాలు తలెత్తినందున స్టార్ లైనర్‌లో వ్యోమగాములు ప్రయాణించడం డేంజర్ అని నాసా సిఫారసు చేయడంతో .. వారు లేకుండానే వ్యోమనౌకను భూమికి రప్పించారు. పారచూట్, ఎయిర్‌బ్యాగ్ సహాయంతో అమెరికాలోని ఓ ఎడారిలో స్టార్‌లైనర్ స్పేస్ క్రాఫ్ట్ ల్యాండ్ అయింది. ఇంతకుముందు 2019, 2022 సంవత్సరాల్లోనూ ఇదే విధంగా వ్యోమగాములు లేకుండా ఈ స్పేస్ క్రాఫ్ట్‌ను సక్సెస్ ఫుల్‌గా ల్యాండ్ చేశారు. గత అనుభవాల నేపథ్యంలో ఈసారి కూడా దాని ల్యాండింగ్ విజయవంతం పూర్తయింది. దీనికి సంబంధించిన ఒక వీడియోను నాసా విడుదల చేసింది. ప్రస్తుతం  అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్‌)లో ఉన్న వ్యోమగాములు సునితా విలియమ్స్, విల్మోర్‌లను వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో స్పేస్ ఎక్స్ కంపెనీకి చెందిన డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్‌లో భూమికి తీసుకురానున్నారు. మొత్తం మీద స్టార్ లైనర్ ప్రయోగం బోయింగ్ కంపెనీకి చేదు అనుభవాన్ని మిగిల్చింది. 10 రోజుల్లో తిరిగి రావాల్సిన స్పేస్ క్రాఫ్ట్ సాంకేతిక లోపంతో మొరాయించి నెలల తరబడి అంతరిక్షంలోనే ఉండిపోయింది. భవిష్యత్తులో ఈ లోపాలను సరిదిద్దుకునేందుకు బోయింగ్ ప్రయత్నించే అవకాశం ఉంది.

Also Read :Ganesh Chaturthi @ Vijayawada : విజయవాడ లో ‘వినాయక చవితి’ కోలాహలమే లేదు..