Site icon HashtagU Telugu

Blue Origin: ఆరుగురు మహిళలు 10 నిమిషాలలో అంతరిక్షంలోకి వెళ్లొచ్చేశారు.. భూమిపైకి రాగానే వాళ్లేం చేశారంటే..?

Blue Origin Mission

Blue Origin Mission

blue origin: అంత‌రిక్ష ప‌ర్య‌ట‌కాన్ని ప్రోత్స‌హించే దిశ‌గా అమెజాన్ వ్య‌వ‌స్థాప‌కుడు జెఫ్ బెజోస్ కు చెందిన బ్లూ ఆరిజ‌న్ సంస్థ మ‌రో ప్ర‌యోగాన్ని విజ‌య‌వంతం చేసింది. సంస్థ‌కు చెందిన‌ న్యూ షెప‌ర్డ్ రాకెట్‌లో ఆరుగురు మ‌హిళ‌ల‌ను అంత‌రిక్షంలోకి తీసుకెళ్లింది. టెక్సాస్‌లోని వాన్ హార్న్ లాంచ్ ప్యాడ్ నుండి రాత్రి 7 గంటలకు రాకెట్ బయలుదేరింది. దాదాపు 10 నిమిషాల తర్వాత మిషన్ భూమికి తిరిగి వచ్చింది. బెజోస్‌ కాబోయే సతీమణి లారెన్‌ శాంచెజ్‌, అమెరికన్‌ గాయని కేటీ పెర్రీ, ప్రముఖ జర్నలిస్టు గేల్‌ కింగ్‌, మానవ హక్కుల కార్యకర్త అమండా సుగూయెన్, చిత్రనిర్మాత కార్యన్ ఫ్లిన్, మాజీ నాసా రాకెట్ శాస్త్రవేత్త ఐషా బోవ్ లు అంతరిక్ష యాత్రను విజ‌య‌వంతంగా పూర్తి చేశారు.

 

వ్యోమ‌నౌక‌లో వీరంతా భూ ఉప‌రిత‌లానికి దాదాపు 106 కిలో మీట‌ర్ల ఎత్తుకు చేరుకుని కాసేపు భార‌ర‌హిత స్థితిని ఆస్వాదించారు. 10 నిమిషాల‌పాటు కొన‌సాగిన ఈ యాత్ర‌లో భాగ‌మైన వారంతా మ‌హిళ‌లే కావ‌డం విశేషం. పారాషూట్ల స‌హాయంతో న్యూ షెప‌ర్డ్ వ్యోమ‌నౌక తిరిగి భూమిపైకి దిగింది. 1963 తర్వాత కేవ‌లం మ‌హిళ‌ల‌తోనే కొన‌సాగిన అంతరిక్ష యాత్ర ఇదే. 1963లో రష్యన్ ఇంజనీర్ వాలెంటినా తెరేష్కోవా ఒంటరిగా అంతరిక్షంలోకి ప్రయాణించారు.

అమెరికన్‌ గాయని కేటీ పెర్రీ భూమికి తిరిగి వచ్చినప్పుడు నేలను ముద్దాడింది. అంతరిక్షం నుండి తిరిగి వచ్చిన తన కాబోయే భార్య లారెన్ సాంచెజ్ కు జెఫ్ బెజోస్ ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికి కౌగిలించుకున్నాడు.

ఈ సంద‌ర్భంగా లారెన్ సాంచెజ్ మాట్లాడుతూ.. నేను మాటల్లో చెప్పలేను. నేను కిటికీలోనుంచి చూశాను. మాకు చంద్రుడు కనిపించాడు. అంత‌రిక్షం నుంచి భూమి చాలా ప్రశాంతంగా కనిపించింది. నిజంగా ఇది ఎంతో అద్భుతంగా, ఉత్సాహంగా ఉంద‌ని తెలిపింది.