Site icon HashtagU Telugu

Biden : ఎన్నికల రేసు నుంచి బైడెన్ ఔట్.. బరిలోకి కమలా హ్యారిస్ ?

Biden Kamala Harris

Biden : అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వాన్ని ఆయన వదులుకున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఆయన ప్రకటించారు.  పార్టీ ప్రయోజనాలు, దేశ ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలుపుతూ ఎక్స్ వేదికగా బైడెన్‌ ఓ లేఖను పోస్ట్ చేశారు. గత మూడున్నర ఏళ్లలో తన ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలను ఈసందర్భంగా ఆయన(Biden) దేశ ప్రజలకు గుర్తుచేశారు. తమ డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థే  మళ్లీ దేశ అధ్యక్షుడిగా ఎన్నికవాలనేది తన ఉద్దేశమన్నారు. వచ్చే వారం జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తానని బైడెన్ తెలిపారు. తనతో పాటు పని చేసిన కమలా హారిస్‌కు కృతజ్ఞతలు తెలిపారు. డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా ప్రస్తుత వైస్ ప్రెసిడెంట్, భారత సంతతి వనిత కమలా హ్యారిస్‌కు తన మద్దతు ఉంటుందని తెలుపుతూ అధ్యక్షుడు బైడెన్ సోషల్ మీడియాలో మరో పోస్ట్ పెట్టారు. డెమొక్రాట్లు ఐక్యంగా నిలబడి ట్రంప్‌ను ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు.

We’re now on WhatsApp. Click to Join

‘‘వృద్ధులకు చౌకగా ఔషధాల పంపిణీ, తుపాకుల నుంచి ప్రజలకు రక్షణ కల్పించే చట్టం, సుప్రీంకోర్టుకు మొదటి అఫ్రో అమెరికన్‌ నియామకం,వాతావరణ మార్పులపై చట్టం అనేవి మా ప్రభుత్వ గెలుపులు. మీ సహకారంతోనే కరోనాపై గెలిచాం. ఆర్థిక సంక్షోభాన్ని బలంగా ఎదుర్కొన్నాం’’ అని బైడెన్ తన లేఖలో చెప్పుకొచ్చారు. జూన్ 25న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో జరిగిన చర్చలో బైడెన్ ఘోర వైఫల్యం చెందడంతో సొంత పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేకత మొదలైంది. దీంతో ఆయన పోటీ నుంచి వైదొలగాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Also Read :File Revised ITR: ఐటీఆర్ ఫైల్ చేసిన‌ప్పుడు మిస్టేక్స్‌ చేశారా..? అయితే ఈ ఆప్ష‌న్ మీకోస‌మే..!

బైడెన్‌ చెప్పినంత మాత్రాన..

బైడెన్‌ చెప్పినంత మాత్రాన కమలా హారిస్‌‌కు(Kamala Harris) డెమొక్రటిక్ పార్టీ నుంచి నేరుగా అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వం దక్కదు. వచ్చే నెల 19 నుంచి 22 మధ్య షికాగోలో జరిగే డెమొక్రటిక్ పార్టీ సదస్సులోనే దేశ అధ్యక్ష అభ్యర్థిని నిర్ణయిస్తారు. 4,700 మంది డెమొక్రటిక్ పార్టీ ప్రతినిధులు కలిసి పార్టీ అధ్యక్ష అభ్యర్థిని ఎన్నుకుంటారు. మళ్లీ ప్రతినిధులతోపాటు సూర్‌ డెలిగేట్లు, మాజీ అధ్యక్షులు, మాజీ ఉపాధ్యక్షుల మద్దతును హారిస్‌ కూడగట్టుకోవాల్సి ఉంటుంది. నవంబరులో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఆలోగానే ఇదంతా జరిగిపోవాలి. ఎన్నికల ప్రచారం కూడా జరగాలి. డెమొక్రాట్లలో ఎక్కువ మంది మద్దతును కలిగి ఉండటం కమలా హ్యారిస్‌కు ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ఎన్నికలకు తక్కువ టైం ఉండటంతో ప్రయోగాలకు పోకుండా.. ఆమెకే ఛాన్స్ ఇచ్చేందుకు డెమొక్రటిక్ పార్టీ మొగ్గు చూపొచ్చని  అంచనా వేస్తున్నారు. అయితే కాలిఫోర్నియా గవర్నర్‌ గవిన్‌ న్యూసమ్, ఇల్లినోయీ గవర్నర్‌ జేబీ ఫ్రిట్జ్‌కెర్‌ కూడా పోటీలో ఉన్నారు.

Exit mobile version