Bed Bugs Vs Paris : నల్లుల బెడదతో ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ సతమతం అవుతోంది. రైళ్లు, బస్సులు, విమానాలు, సినిమా హాళ్లు ఇలా ప్రతీచోటా నల్లులు హల్ చల్ చేస్తూ.. ప్రజలను బెంబేలు పెట్టిస్తున్నాయి. ఈ తరుణంలో ‘‘నల్లుల వల్ల ప్యారిస్ నగరంలో ఎవరూ సురక్షితంగా లేరు’’ అని పారిస్ డిప్యూటీ మేయర్ చేసిన వ్యాఖ్యను బట్టి ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. వచ్చే ఏడాది ఒలింపిక్ క్రీడల నిర్వహణకు రెడీ అవుతున్న ప్యారిస్ నగరానికి.. నల్లుల ప్రాబ్లమ్ పెద్ద ఛాలెంజ్ గా మారింది.
Also read : Suryapet : ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కి ఎదురుదెబ్బ..
నల్లుల సంచారానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఫ్రాన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని దేశ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నల్లుల కట్టడికి చేపట్టాల్సిన చర్యలను నిర్దేశించేందుకు వచ్చే వారంలో ప్రజారవాణా విభాగాల ప్రతినిధులతో సమావేశం అవుతామని ఫ్రాన్స్ రవాణాశాఖ మంత్రి క్లెమెంట్ బ్యూన్ వెల్లడించారు. వాస్తవానికి మూడేళ్ల క్రితమే నల్లులపై ఫ్రాన్స్ ప్రభుత్వం యుద్ధాన్ని ప్రకటించింది. నల్లుల నివారణ చర్యల కోసం ప్రత్యేక వెబ్‌సైట్, అత్యవసర నంబర్‌ను కూడా ఏర్పాటు చేసింది. అనేక మార్గదర్శకాలను అధికారులకు, ప్రజలకు జారీ చేసింది. ఎన్నో క్రిమినాశక రసాయనాలను ప్రభావిత ప్రాంతాల్లో స్ప్రే చేసినా నల్లులు నశించకపోగా (Bed Bugs Vs Paris).. ఇంకా పెరిగిపోయాయి.