Train Fire : బంగ్లాదేశ్‌లో రైలుకు నిప్పంటించిన మూకలు.. ఐదుగురి మృతి

  • Written By:
  • Publish Date - January 6, 2024 / 08:16 AM IST

Train Fire : బంగ్లాదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలకు రెండు రోజుల ముందు(శుక్రవారం రాత్రి) రాజధాని ఢాకాలో గుర్తు తెలియని దుండగులు రైలుకు నిప్పంటించారు. బోగీలలో మంటలు చెలరేగడంతో ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురు ప్రయాణికులు మరణించారు. పలువురు గాయపడ్డారు. ఈ ఘటనలో ఢాకాలోని గోపీబాగ్‌ రైల్వే స్టేషన్‌లో బెనాపోల్ ఎక్స్‌ప్రెస్ రైలులో నాలుగు రైలు కోచ్‌లు దగ్ధమైనట్లు గుర్తించారు. ఈ రైలులో కొందరు భారతీయులు కూడా ప్రయాణిస్తున్నట్లు సమాచారం. భారత్‌లోని పశ్చిమ బెంగాల్ బార్డర్‌లో ఉన్న బెనాపోల్ పట్టణం నుంచి నడిచే బెనాపోల్ ఎక్స్‌ప్రెస్‌ శుక్రవారం రాత్రి 9 గంటలకు ఢాకాలోని గోపీబాగ్‌ రైల్వే స్టేషన్‌‌కు చేరుకోగానే కొందరు రైలులోకి చొరబడి నిప్పంటించారని అంటున్నారు. మంటలను అదుపులోకి తీసుకుని రావడానికి అగ్ని మాపక సిబ్బంది చాలా శ్రమ పడాల్సి వచ్చింది. అగ్నిమాపక సిబ్బంది రాత్రి 9.35 గంటలకు ఘటనా స్థలానికి చేరుకుని 11.30 గంటలకు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మృతులను వెంటనే గుర్తించలేకపోయారు.

మంటలు వేగంగా వ్యాపించడంతో..

ప్రస్తుతం ఈ వ్యవహారంపై విచారణ కొనసాగుతోంది. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.  రైలును తనిఖీ చేస్తున్నామని.. ప్రత్యక్ష సాక్షుల ద్వారా సమాచారాన్ని సేకరిస్తున్నామని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ‘‘కాలిపోతున్న రైలు నుంచి ప్రయాణికులను బయటకు తీయడానికి వందలాది మంది ప్రజలు తరలివచ్చారు. మేం చాలా మందిని రక్షించాం. కానీ మంటలు(Train Fire) వేగంగా వ్యాపించడంతో ఐదుగురు చనిపోయారు. రైలులో కొంతమంది భారతీయ పౌరులు కూడా ఉన్నారు.ఇది  ఎవరో కుట్రపూరితంగా చేసిన విధ్వంస చర్యే అయి ఉండొచ్చు’’ అని పోలీసు వర్గాలు చెప్పాయి.

We’re now on WhatsApp. Click to Join.

దేశంలో సార్వత్రిక ఎన్నికలు జనవరి 7న జరగనున్న తరుణంలో శాంతిభద్రతలను  దెబ్బతీయడానికి ఈ హింసను కొందరు ప్రేరేపించి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. మరోవైపు బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికలను ప్రతిపక్షాలు బహిష్కరించాయి. ఈ ఘటన వెనుక బంగ్లాదేశ్ ప్రధాన ప్రతిపక్షం  బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) ఉందనే ప్రచారం జరిగింది. అయితే దీని వెనుక తాము లేమని, ఆ ఘటనతో తమకు సంబంధం లేదని బీఎన్‌పీ స్పష్టం చేసింది. ఈ రైలులోని దాదాపు 292 మంది ప్రయాణికుల్లో ఎక్కువ మంది ఓటు వేసేందుకు భారతదేశం నుంచి బంగ్లాదేశ్‌లోని తమ ఇళ్లకు వస్తున్న వారే ఉన్నారని తెలుస్తోంది.  బంగ్లాదేశ్‌లో జనవరి 7న సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా అధికారంలో ఉన్నారు. అవామీ లీగ్ పార్టీ ప్రతినిధిగా హసీనా అదికారంలో ఉండగా.. దేశంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ. ఈ బీఎన్‌పీ ఎన్నికలను పూర్తిగా బహిష్కరించింది. బంగ్లాదేశ్‌లో మొత్తం 300 సీట్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో అవామీ లీగ్ 300 సీట్లకు గాను 290 సీట్లు గెలుచుకుంది.

 Also Read: Ship Hijack : సముద్ర దొంగలు పరార్.. హైజాక్ అయిన నౌకను రక్షించిన నేవీ