Sheikh Hasina : బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం భారత్‌లో ఆశ్రయం పొందిన మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా రెడ్ పాస్‌పోర్టును (దౌత్య పాస్‌పోర్టును) రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. షేక్ హసీనా హయాంలో ఆమె ప్రభుత్వంలోని ఎంపీలందరికీ జారీ అయిన దౌత్య పాస్‌పోర్టులను కూడా రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. దేశంలో వారంతా తీవ్ర నేర అభియోగాలను ఎదుర్కొంటున్నందున ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. బంగ్లాదేశ్ స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాల వారికి రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్న జరిగిన ఉద్యమాన్ని తీవ్రంగా అణచివేసి, వందలాది మంది ప్రాణాలను బలిగొనడంతో షేక్ హసీనా(Sheikh Hasina), ఆమె ప్రభుత్వంలోని ఎంపీల హస్తం ఉందని మధ్యంతర ప్రభుత్వం ఆరోపించింది.
రెడ్ పాస్‌పోర్టు ఏమిటి ?
దౌత్య పాస్‌పోర్టునే రెడ్ పాస్ పోర్టు అని కూడా పిలుస్తారు. దీన్ని ఎంపీలకు, కేంద్రమంత్రులకు, జాతీయ స్థాయి అధికారులకు, రాష్ట్రాల ముఖ్యమంత్రులకు అందిస్తుంటారు. ఈ పాస్‌పోర్టులో 28 పేజీలు ఉంటాయి. ఇది ఉన్నవాళ్లు కొన్ని దేశాలకు వీసా లేకుండా నేరుగా వెళ్లిపోవచ్చు. ప్రస్తుతం ఈ పాస్‌పోర్టు రద్దు కావడంతో షేక్ హసీనా, ఆమె పార్టీ (అవామీ లీగ్) ఎంపీలు ఆయా ప్రయాణ సౌకర్యాలను కోల్పోనున్నారు. షేక్ హసీనా హయాంలో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) ఎంపీలపైనా ఇలాంటి ఆంక్షలనే అమలు చేశారు. ఇప్పుడు సీన్ మారడంతో అవే చర్యలను షేక్ హసీనా, ఆమె అనుచరులపై తీసుకుంటున్నారు. త్వరలో బంగ్లాదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో షేక్ హసీనా కీలక అనుచరులు ఒకవేళ బంగ్లాదేశ్ సరిహద్దులు దాటితే ఏవైనా రాజకీయ కుట్రలు చేయొచ్చనే అంచనాల నడుమ మధ్యంతర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
We’re now on WhatsApp. Click to Join
దౌత్య పాస్‌పోర్టు కూడా రద్దయిన ప్రస్తుత తరుణంలో షేక్ హసీనా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ? భారత్‌లోనే ఉంటారా ? అమెరికా లేదా ఏదైనా ఐరోపా దేశం లేదా ఏదైనా అరబ్ దేశానికి ఆశ్రయం కోసం వెళ్తారా ? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వం తాజా నిర్ణయంతో భారత ప్రభుత్వ వైఖరిలో ఏదైనా మార్పు వస్తుందా అనేది వేచిచూడాలి. ఒకవేళ అదే జరిగితే.. షేక్ హసీనాను ఏదైనా ఇతర దేశానికి వెళ్లిపోవాలని భారత్ సలహా ఇచ్చే అవకాశం ఉందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.