Bangladesh : ప్రధానమంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి బంగ్లాదేశ్ విడిచి భారత్‌కు వచ్చేసినందున.. అక్కడ ఇవాళ రాత్రి మధ్యంతర ప్రభుత్వం ఏర్పడబోతోంది. మధ్యంతర ప్రభుత్వంలో తాత్కాలిక ప్రధానమంత్రిగా నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, ఆర్థికవేత్త మహ్మద్ యూనుస్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈమేరకు ఆయన ఈరోజు రాత్రి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇప్పటివరకు ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లో ఉన్న మహ్మద్ యూనుస్ నిన్ననే అక్కడి నుంచి ఢాకాకు బయలుదేరారు. తాజాగా ఇవాళ ఉదయం ఆయన బంగ్లాదేశ్(Bangladesh) రాజధాని ఢాకాలోని హజ్రత్ షాజలాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యారు.
We’re now on WhatsApp. Click to Join
అనంతరం మహ్మద్ యూనుస్ విలేకరులతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.‘‘విద్యార్థులు బంగ్లాదేశ్‌ను రక్షించారు. ఈ స్వేచ్ఛను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది’’ అని మహ్మద్ యూనుస్ పేర్కొన్నారు. ‘‘బంగ్లాదేశ్‌కు రెండోసారి స్వాతంత్య్రం లభించింది. దీన్ని రక్షించడానికి ప్రజలు కృషి చేయాలి’’ అని ఆయన తెలిపారు. అంతకుముందు విమానం నుంచి మహ్మద్ యూనుస్ దిగగానే ఆర్మీ చీఫ్ జనరల్ వకారుజ్జమా సాదర స్వాగతం పలికారు. నౌకాదళ, వైమానిక దళ అధిపతులు ఈసందర్భంగా ఆర్మీ చీఫ్ వకారుజ్జమా వెంటే ఉన్నారు.
షేక్ హసీనా కుమారుడి కీలక వ్యాఖ్యలు
బంగ్లాదేశ్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలపై షేక్ హసీనా కుమారుడు సజీబ్ వాజెద్ జాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘పాకిస్తాన్‌కు చెందిన ఐఎస్ఐ బంగ్లాదేశ్‌లో అశాంతికి ఆజ్యం పోస్తోంది’’ అని ఆరోపించారు. బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరిగిన తర్వాత షేక్ హసీనా బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్తారని ఆయన వెల్లడించారు. ఇక బంగ్లాదేశ్ అంతటా భారతీయ వీసా దరఖాస్తు కేంద్రాలు మూతపడ్డాయి. ఆ దేశంలో అశాంతి నెలకొన్నందున వీసాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఆన్‌లైన్ పోర్టల్‌ను గురువారం తెరిచారు. అయినప్పటికీ, భారతీయ దౌత్య మిషన్లు పనిచేస్తూనే ఉన్నాయి. భారతీయ దౌత్యవేత్తలు బంగ్లాదేశ్‌లో అందుబాటులో ఉన్నారు.