బంగ్లాదేశ్ ఎన్నికలు.. షేక్ హసీనా పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ!

జూలై 2024 విద్యార్థి ఉద్యమం తర్వాత హసీనా ప్రభుత్వం కూలిపోవడం, ఇప్పుడు అవామీ లీగ్ ఎన్నికలకు దూరం కావడం బంగ్లాదేశ్ రాజకీయాలను పూర్తిగా మార్చివేసింది.

Published By: HashtagU Telugu Desk
Sheikh Hasina

Sheikh Hasina

Sheikh Hasina: ఫిబ్రవరి 2026లో జరగనున్న పార్లమెంటరీ ఎన్నికల్లో షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ పాల్గొనలేదని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం స్పష్టం చేసింది. పార్టీపై పూర్తిస్థాయి నిషేధం ఉండటం, ఎన్నికల సంఘం దాని రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయడమే దీనికి కారణం.

ప్రభుత్వ నిర్ణయం- కారణాలు

గత మే నెలలో గృహ మంత్రిత్వ శాఖ ‘యాంటీ టెర్రరిజం ఆర్డినెన్స్’ కింద గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తూ అవామీ లీగ్, దాని అనుబంధ సంస్థలపై నిషేధం విధించింది. అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ (ICT) విచారణ పూర్తయ్యే వరకు ఈ నిషేధం అమలులో ఉంటుంది. ప్రస్తుతం ఆ పార్టీ నాయకులు ట్రిబ్యునల్‌లో విచారణను ఎదుర్కొంటున్నారు. ప్రధాన సలహాదారు ప్రెస్ సెక్రటరీ షఫీకుల్ ఆలం మాట్లాడుతూ,.. అవామీ లీగ్‌కు సంబంధించిన ఎటువంటి రాజకీయ కార్యకలాపాలను అనుమతించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

Also Read: డిప్యూటీ సీఎం పవన్ ఎఫెక్ట్.. భీమవరం డీఎస్పీపై బదిలీ వేటు !

షేక్ హసీనా ఘాటు విమర్శలు

విదేశాల్లో ఉంటున్న షేక్ హసీనా ఈ నిర్ణయంపై తీవ్రంగా స్పందించారు. అవామీ లీగ్ లేని ఎన్నికలు అసలు ఎన్నికలే కావని, అవి కేవలం “పట్టాభిషేకం” మాత్రమేనని ఆమె విమర్శించారు. ఒక్క ఓటు కూడా లేకుండా అధికారంలో ఉన్న ముహమ్మద్ యూనస్ ప్రభుత్వం, కోట్ల మంది ప్రజల ఓటు హక్కును లాగేసుకుంటోందని మండిపడ్డారు. ప్రజాదరణ పొందిన పార్టీని నిషేధించడం జాతీయ సయోధ్యకు పెద్ద అడ్డంకి అని, ప్రజలు తమకు ఇష్టమైన పార్టీకి ఓటు వేయలేనప్పుడు పోలింగ్ కేంద్రాలకు రారని ఆమె హెచ్చరించారు.

మారుతున్న రాజకీయ సమీకరణాలు

జూలై 2024 విద్యార్థి ఉద్యమం తర్వాత హసీనా ప్రభుత్వం కూలిపోవడం, ఇప్పుడు అవామీ లీగ్ ఎన్నికలకు దూరం కావడం బంగ్లాదేశ్ రాజకీయాలను పూర్తిగా మార్చివేసింది. ప్రస్తుతం బీఎన్‌పీ, జమాత్ వంటి పార్టీలు రంగంలో ఉన్నాయి. అయితే దేశంలోని ఒక ప్రధాన పార్టీని మినహాయించడం వల్ల కొత్త ప్రభుత్వ నైతికతపై, ప్రజాస్వామ్య ప్రక్రియపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

  Last Updated: 25 Dec 2025, 04:27 PM IST