Site icon HashtagU Telugu

Bangladesh Ex Pm Sheikh Hasina : షేక్ హసీనా కు ఉరిశిక్ష విధిస్తూ బంగ్లాదేశ్ కోర్టు సంచలన తీర్పు.!

Sheikh Hasina

Sheikh Hasina

పొరుగు దేశం బంగ్లాదేశ్‌ మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారనే అభియోగాలపై ఆ దేశ మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనాపై నమోదైన కేసుల్లో.. ఐసీటీ సోమవారం తీర్పు వెలువరించింది. ఈ కేసుల్లో హసీనాను దోషిగా నిర్దారిస్తూ.. ఆమెకు ఉరిశిక్ష ఖరారు చేసింది ఢాకాలోని ఐసీటీ కోర్టు. ఆమె మానవత్వాన్ని మరిచి, ఆందోళనకారులను కాల్చి చంపమని ఆదేశాలు జారీచేశారని న్యాయమూర్తి పేర్కొన్నారు. అయితే, తాను వీటిని పట్టించుకోనని హసీనా అన్నారు.

మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారన్న ఆరోపణల కేసులో బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి షేక్‌ హసీనాను అక్కడి కోర్టు దోషిగా నిర్దారించింది. అంతేకాదు, గరిష్ఠ శిక్షకు అర్హురాలని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ సోమవారం తీర్పు వెలువరించింది. హసీనా మానవత్వాన్ని మరిచారని, ఆమె నేరం చేశారని చెప్పడానికి తగి ఆధారాలున్నాయని పేర్కొంది. ఆందోళనకారులను చంపమని ఆదేశాలు జారీచేశారని పేర్కొంటూ ఆమెకు మరణశిక్ష విధించింది. కాగా, ఈ కోర్టు తీర్పునకు ముందు హసీనా మాట్లాడుతూ.. అవన్నీ తప్పుడు ఆరోపణలని, అటువంటి తీర్పులను తాను పట్టించుకోనని ఉద్ఘాటించారు. తన మద్దతుదారులకు ఆడియో సందేశం పంపిన హసీనా.. మహమ్మద్ యూనస్ నాయకత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం తన పార్టీని లేకుండా చేయాలని చూస్తోందని ఆరోపించారు. ‘ఇది అంత సులభం కాదు.. అవామీ లీగ్ అధికారాన్ని దోచుకున్న వ్యక్తి జేబు నుంచి కాదు, అట్టడుగు స్థాయి నుంచి వచ్చింది’ అని అన్నారు.

బంగ్లాదేశ్‌లో నిరసన ప్రదర్శనలకు తన మద్దతుదారులు ఆకస్మికంగా స్పందించారని హసీనా అన్నారు. ‘వాళ్లు మాకు విశ్వాసం కల్పించారు. ఈ అవినీతిపరుడు, ఉగ్రవాది, హంతకుడు యూనస్, అతడి సన్నిహితులకు బంగ్లాదేశ్ ఎలా మారగలదో ప్రజలు చూపిస్తారు.. ప్రజలు న్యాయం చేస్తారు’ అని ఆమె అన్నారు. గతేడాది రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ యువత చేపట్టి ఆందోళనలు హింసాత్మకంగా మారి చివరకు షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయి ప్రాణాలను కాపాడుకోడానికి భారత్‌కు పారిపోయి వచ్చారు. అనంతరం యూనస్ నాయకత్వంలో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం.. హసీనాపై మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారనే అభియోగాలు నమోదుచేసింది. ఈ కేసు విచారణకు హాజరుకావాలని కోర్టు సమన్లు జారీచేయగా.. హసీనా వాటిని తిరస్కరించారు.

తన గురించి ఆందోళన చెందవద్దని మద్దతుదారులకు ఆమె సూచించారు. ‘నేను ప్రాణాలతో ఉన్నాను.. ఉంటాను.. మళ్లీ ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తాం..బంగ్లాదేశ్ గడ్డపై న్యాయం చేస్తా’ అని అన్నారు. అధికారాన్ని యూనస్ బలవంతంగా లాక్కున్నాడని, ఎన్నికైన ప్రతినిధులను వారి పదవుల నుంచి బలవంతంగా తొలగించడం శిక్షార్హమని బంగ్లాదేశ్ రాజ్యాంగం చెబుతుందని ఆమె అన్నారు. ‘యూనస్ తన కుట్రల ద్వారా సరిగ్గా అదే చేశాడు’ అని ఆమె అన్నారు.

గతేడాది జులైలో జరిగిన తిరుగుబాటు సమయంలో నిరసనకారుల డిమాండ్లను తమ ప్రభుత్వం అంగీకరించిందని, కానీ కొత్త డిమాండ్లు వస్తూనే ఉన్నాయని ఆమె అన్నారు. దీని వెనుక ‘అరాచక పరిస్థితిని సృష్టించడమే లక్ష్యం’ అని ఆరోపించారు. తన పాలనలో మానవహక్కుల ఉల్లంఘన జరిగిందనే ఆరోపణలను తోసిపుచ్చారు. ‘నేను 10 లక్షల మంది రోహింగ్యాలకు ఆశ్రయం కల్పించానని మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారా?’ అని హసీనా ప్రశ్నించారు.

Exit mobile version