Dhaka Jet Crash : బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో చోటుచేసుకున్న విమాన ప్రమాదం దేశాన్ని విషాదంలో ముంచేసింది. వాయుసేనకు చెందిన F-7 BGI శిక్షణ విమానం సోమవారం మధ్యాహ్నం ఢాకా ఉత్తరా ప్రాంతంలోని మైల్స్‌టోన్ స్కూల్ అండ్ కాలేజ్ భవనంపై కూలిపోయింది. ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య 27కు చేరుకుంది. మృతులలో 25 మంది విద్యార్థులే ఉండగా, మిగతా ఇద్దరిలో పైలట్ మరియు ఓ మహిళా ఉపాధ్యాయురాలు ఉన్నారని అధికారులు వెల్లడించారు.
ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) ప్రకారం, ఈ శిక్షణ జెట్ స్థానిక కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం 1.06 గంటలకు ఎగిరి, కేవలం 24 నిమిషాల తర్వాత, 1.30 గంటలకు పాఠశాల భవనంపై కూలిపోయింది. ఈ ఘటనలో మొత్తం 171 మంది గాయపడ్డారు. ఘటన తర్వాత బంగ్లాదేశ్ ఆర్మీ సిబ్బంది, ఎనిమిది ఫైర్ సర్వీస్ అండ్ సివిల్ డిఫెన్స్ ఇంజిన్లు తక్షణమే అక్కడికి చేరుకుని రక్షణ చర్యలు ప్రారంభించాయి. “ఈ రెండు అంతస్తుల భవనం మొదటి అంతస్తులో 3వ, 4వ తరగతుల విద్యార్థులకు క్లాసులు జరుగుతుండగా, రెండవ అంతస్తులో 2వ, 5వ తరగతుల విద్యార్థుల తరగతులు జరుగుతున్నాయి,” అని బంగ్లాదేశ్ ఫైర్ సర్వీస్ అండ్ సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ జనరల్ మహ్మద్ జాహెద్ కమాల్ తెలిపారు.
అతను ఇంకా “భవనం పక్కన ప్రిన్సిపాల్ కార్యాలయానికి సంబంధించిన సమావేశ గది ఉంది. అదేవిధంగా కోచింగ్ క్లాస్ కూడా జరుగుతోంది,” అని వెల్లడించారు. మంగళవారం ఉదయం ఢాకాలోని నేషనల్ బర్న్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ ఇన్‌స్టిట్యూట్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రత్యేక సహాయకుడు సయీదూర్ రెహమాన్ మృతుల సంఖ్యను ధృవీకరించారు. “మృతులలో 25 మంది పిల్లలు ఉన్నారు. వీరిలో చాలామంది వయసు 12 సంవత్సరాల లోపే. పైలట్ మరియు ఒక ఉపాధ్యాయురాలు కూడా మృతి చెందారు,” అని ఢాకా డైలీ స్టార్ పత్రికకు రెహమాన్ తెలిపారు.
“ప్రస్తుతం 78 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో ఐదుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఇప్పటివరకు 20 మంది మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించాము,” అని ఆయన వెల్లడించారు. మృతులలో 6 మందిని ఇంకా గుర్తించలేకపోయారని, వారి DNA నమూనాలను సేకరించామని రెహమాన్ తెలిపారు. “గాయపడిన వారిలో ఎక్కువ మంది పిల్లలే. వీరికి తక్కువ రక్త అవసరం ఉంటుంది. బంగ్లాదేశ్ మెడికల్ యూనివర్శిటీ (BMU) ICU సౌకర్యాలు పూర్తిగా సిద్ధంగా ఉన్నాయి. మేము అన్ని రకాల వైద్య సహాయాన్ని అందిస్తున్నాం,” అని రెహమాన్ వివరించారు.
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో రాశి ఖన్నా.. లుక్ కూడా అదుర్స్