PAK Embassy: ఢిల్లీలోని పాకిస్థాన్ రాయబార కార్యాలయంలో పనిచేసే సీనియర్ అధికారులు తన పట్ల అనుచితంగా ప్రవర్తించారని పంజాబ్‌కు చెందిన ఓ మహిళా ప్రొఫెసర్ పలు ఆరోపణలు చేయడం చర్చనీయాంశమైంది. 2021లో పాకిస్తాన్‌ను సందర్శించేందుకు వీసా కోసం ఆమె దరఖాస్తు చేసుకోవాలనుకున్నారు. అయితే తాను పాక్ ఎంబసీని సందర్శించిన టైంలో అక్కడి సీనియర్ అధికారులు తనను లైంగిక వేధింపులకు గురిచేసినట్లు ఆరోపణలు చేసింది. అప్పటి ఘటనను గురించి ఓ వార్తా సంస్ధతో ఆమె మాట్లాడుతూ కన్నీటిపర్యంతమైంది.
తాను పాకిస్తాన్ హై కమిషన్‌తో ఆన్‌లైన్ వీసా అపాయింట్‌మెంట్ బుక్ చేసుకున్నట్లు తెలిపింది. తాను లాహోర్‌లోని ఓ యూనివర్సిటీలో లెక్చర్ ఇవ్వాల్సిఉందని, అక్కడి కట్టడాల గురించి పలు విషయాలను రాయాలనుకుంటున్నట్లు ఎంబసీ అధికారులకు తెలిపానంది. అయితే తాను అక్కడి నుంచి వెళ్తుండగా మరో అధికారి అక్కడికి వచ్చి తనను వ్యక్తిగతమైన ప్రశ్నలు అడిగారని, అంతేకాకుండా తనను ఎందుకు పెళ్లి చేసుకోలేదని ప్రశ్నించినట్లు తెలిపింది. పెళ్లి చేసుకోకుండా ఎలా ఉండగలుగుతున్నారని, లైంగిక వాంఛలు ఎలా తీర్చుకుంటారని అనుచితంగా ఆమెను ప్రశ్నించినట్లు వెల్లడించింది.