Plane Crash : కజకిస్తాన్ దేశంలోని అక్తౌ నగరంలో గత బుధవారం (డిసెంబరు 25న) అజర్‌బైజాన్ ఎయిర్‌లైన్స్ విమానం (J2-8243) కూలిన ఘటన కలకలం రేపింది. ఆ ప్రమాదంలో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటనపై ఆదివారం రోజు అజర్‌బైజాన్ ప్రెసిడెంట్ ఇల్హామ్ అలియేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా భూభాగం నుంచి జరిపిన కాల్పుల్లోనే ఈ విమానం కూలిందన్నారు. ప్రమాదవశాత్తు తమ దేశ విమానం లక్ష్యంగా దాడి జరిగిందని పేర్కొన్నారు. ‘‘మా దేశ విమానం తొలుత ఒక విధమైన ఎలక్ట్రానిక్ జామింగ్ వ్యవస్థ కిందకు వచ్చింది. ఆ విమానం దక్షిణ రష్యా నగరమైన గ్రోజ్నీ వైపు వెళ్తుండగా.. దానిపై రష్యా భూభాగం నుంచి దాడి జరిగింది. ఫలితంగా కూలిపోయింది’’ అని ఇల్హామ్ అలియేవ్ చెప్పారు. ‘‘విమానాన్ని కూల్చేసినందుకు రష్యా నేరాన్ని అంగీకరించాలి. విమానాన్ని ఘోరంగా దెబ్బతీసినందుకు బాధ్యులను శిక్షించాలి. మేం కోరుకుంటున్నది అదే’’ అని ఆయన డిమాండ్ చేశారు.
Also Read :Telangana Crime Rate Report 2024 : తెలంగాణలో పెరిగిన క్రైమ్ రేట్
ఈ దాడి తమ భూభాగం నుంచే జరిగిందని ఇటీవలే రష్యా అధ్యక్షుడు పుతిన్ (Plane Crash) ఒప్పుకున్నారు. ఇందుకుగానూ అజర్ బైజాన్ దేశానికి బహిరంగ క్షమాపణలు చెప్పారు. రష్యాలోని దక్షిణ భూభాగంపై ఉక్రెయిన్ డ్రోన్లు దాడి చేస్తుండగా తమ సైన్యం ఫైరింగ్ చేసిందని.. ఈక్రమంలోనే మిస్సైల్ వెళ్లి అజర్ బైజాన్ ఎయిర్ లైన్స్ విమానాన్ని తాకిందన్నారు. కాగా, రష్యా మిస్సైల్ తాకినందు వల్లే విమానం కూలిందంటూ ఉక్రెయిన్‌తో పాటు అజర్‌బైజాన్ కూడా ఆరోపణలు చేసింది. ఈ క్రమంలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్ సారీ చెప్పారు.
2022 ప్రారంభం నుంచి రష్యా – ఉక్రెయిన్ యుద్ధం నడుస్తోంది. అయినా అది నేటికీ ముగియడం లేదు. అందుకే ఉత్తర కొరియా సైనికులను కూడా పుతిన్ బరిలోకి దించారు. దాదాపు 10వేల మంది కిమ్ సైనికులు ప్రస్తుతం యుద్ధ రంగంలో ఉన్నారు. అయినా భాషాపరమైన సమస్య కారణంగా మాస్కో, కొరియన్ సేనల మధ్య సమన్వయం లోపిస్తోంది.